శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా మార్పు వస్తుంది
రానున్న శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా మార్పు వస్తుందని నటుడు విశాల్ పేర్కొన్నారు. నటుడు విశాల్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే.. సినీ సంఘాల్లో కూడా కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన ఇటీవల ఆర్‌కే నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇటీవల రాజకీయ అరంగేట్రం చేయడంతో.. ఆయనకు అవసరమైతే తాను సహకరిస్తానని కూడా విశాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న విశాల్ మాట్లాడుతూ.. రజనీకాంత్, కమల్‌హాసన్‌లు రాజకీయాలకు కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ.. వాళ్లు తీసుకున్న నిర్ణయం మాత్రం సరైనదేనని పేర్కొన్నారు. ఇద్దరు బరిలో ఉన్నందున ప్రజలు ఎవరికి ఓటు వేస్తారోననే విషయాన్ని చెప్పలేకపోతున్నానని అన్నారు. అయితే రానున్న శాసన సభ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా మార్పు వస్తుందని ఉద్ఘాటించారు. ఆర్‌కే నగర్ నియోజకవర్గంలో తన నామినేషన్ నిరాకరించడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్లేనని చెప్పారు. కానీ ఆ అంశమే నన్ను మరింత బలవంతుడిని చేస్తోందని వివరించారు.
రాజకీయాల్లోకి వస్తాను.
రాజకీయాల్లోకి అడుగుపెడుతానని తమిళ హీరో విశాల్ వెల్లడించారు. ఆర్కే నగర్ ఉపఎన్నికలో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చివేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ ప్రవేశంపై మాట్లాడుతూ దీనిపై వ్యాఖ్యానించేందుకు మరింత సమయముందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తలంపుతోనే నటులు రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన అన్నారు.తమిళనాడులో నెలకొన్న రాజకీయ వాతావరణ పరిస్థితులు తనను రాజకీయాల వైపు అడుగువేయిస్తున్నాయని తెలిపారు.