మంజీరా నదిపై మఠాఠ అధికారుల పెత్తనం
నిజామాబాద్,
మంజీరానదిలోని ఇసుక కాసులు కురిపించడమేమో గానీ తెలంగాణ పై మహారాష్ట్ర పెత్తనం నిత్యకృత్యంగా మారింది. ఇందులో ఉన్న ఇసుక నిలువలన్నీ తమవేనంటూ అక్కడి అధికారులు తెలంగాణ అధికారులపై దాదాగిరీ చెలాయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మంజీరా పరివాహక గ్రామంలో ఉన్నటువంటి అక్రమ నిలువలను గుర్తించిన ఇక్కడి అధికారులు వాటికి వేలం వేసి చేతులు దులుపుకోవడంతో నేడు వాటిని దక్కించుకున్న వ్యక్తులు చుక్కలు లెక్కపెట్టాల్సి వస్తోంది. ఈ నిల్వల వేలం తర్వాత కుప్పలు తీసే సమయంలో అడ్డుపడిన మరాఠా అధికారులు తాజాగా వేలంలో పాల్గొన్న వారికి లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని నోటీసు జారీ చేసి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ రెవెన్యూ పోలీసు అధికారులు పట్టించుకోక పోవడంతో నోటీసు అందుకున్న బాధితుడు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఖాజాపూర్ గ్రామ శివారులో పది ఇసుక ట్రాక్టర్‌ల ఇసుక నిలువలు వేసి ఉండటంతో సమాచారం అందుకున్న బోధన్ తహశీల్దార్ గంగాధర్ వాటిని సీజ్ చేసి, వేలం వేశారు. ఈ కుప్పలను పదివేల రూపాయలకు దక్కించుకున్న కొప్పర్గ గ్రామానికి చెందిన ఆరీఫ్ ఇక్కడి రెవెన్యూ అధికారులకు పదివేల రూపాయలు చెల్లించి ఇసుకను టిప్పర్లలో నింపుకుని ఇంటికి తీసుకెళుతుండగా మహారాష్ట్ర రెవెన్యూ, పోలీసు అధికారులు మంజీరా వద్దకు వచ్చి ఈనిలువలన్నీ తమ భూబాగంలోనివేనని అడ్డు తగిలారు. దాంతో వేలంలో ఇసుకను దక్కించుకున్న వ్యక్తి వెంటనే బోథన్ తహశీల్దార్ గంగాధర్‌తో పాటు ఇక్కడి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. వారు ఇసుక కుప్పల వద్దకు చేరుకుని ఇవన్నీ తమ భూబాగంలో ఉన్నాయని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల అధికారులు తమవంటే తమవని పేర్కొనడంతో మరాఠా అధికారులు టిప్పర్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. దాంతో ఏమి చేయలేక ఇక్కడి రెవెన్యూ అధికారులు తిరుగుముఖం పట్టారు. ఆ తర్వాత దీనిపై అధికారులు ముందడుగు వేయక పోవడంతో నేడు మహారాష్ట్ర రెవెన్యూ అధికారులు మరో అడుగు ముందుకేసి ఇసుక వేలం దక్కించుకున్న వ్యక్తికి లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. సోమవారం వరకు జరిమానా చెల్లించకుంటే టిప్పర్ యజమాని, డ్రైవర్, టిప్పర్‌పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దాంతో సదరు వ్యక్తి ఆందోళనకు గురై తహశీల్దార్‌కు నోటీసు విషయాన్ని నోటీసు ఎందుకు తీసుకున్నావంటూ సమాధానం చెప్పగా ఆదివారం నాడిక్కడ బాధితుడు విలేఖరులతో మాట్లాడుతూ మరాఠా దాదాగిరీ గురించి వివరించారు. ఇక్కడి రెవెన్యూ అధికారులు ఇసుక కుప్పలకు వేలం వేసి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారని మహారాష్ట్ర అధికారులు కేసులు నమోదు చేస్తున్నా స్పందించడం లేదని ఆరోపించారు.