అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహా యాగం గోడపత్రికలు ఆవిష్కరణ
తిరుపతి
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 16 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహా యాగం గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి తిరుపతి జెఈవో పి.బసంత్కుమార్ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని జెఈవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహా యాగంలో భాగంగా ప్రధానాచార్యుల ఆధ్వర్యంలో ఆలయంలో 108 హోమగుండాలు ఏర్పాటు చేసి, వివిద రాష్ట్రాలకు చెందిన 108 మంది ప్రముఖ రుత్వికులు హోమం చేస్తారని తెలిపారు. ఈ యాగం ద్వారా దేశంలో రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వర్షలు కురిసి, సంవృద్ధిగా పంటలు పండి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యాగం నిర్వహిస్తున్నామన్నారు. స్వామివారి వైభవాన్ని నలు దిశల వ్యాప్తి చేయడానికి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ యాగం నిర్వహిస్తున్నామన్నారు. ఈ యాగంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఇందులో భాగంగా అక్టోబరు 16వ తేదీ ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు ఆచార్యవరణం, విష్వక్సేనారాధనము, పుణ్యాహవచనం, వాస్తుహోమం, సాయంత్రం 4.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు అంకురార్పణంతో మహా యాగము ప్రారంభమవుతుందన్నారు. అక్టోబరు 17న ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గో పూజ, శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. అక్టోబరు 18న ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు గజపూజ, పూర్ణాహుతితో మహా యాగం ముగుస్తుందన్నారు.