ఇథియోపియా ప్రధానికి నోబెల్
స్టాక్ హోం,
ఈ యేటి నోబెల్ శాంతి బహుమతిని ఇథియోపియా ప్రధాని అబే అహ్మాద్ అలీ గెలుచుకున్నారు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ఇవాళ నోబెల్ కమిటీ ఈ ప్రకటన చేసింది. శాంతి స్థాపన కోసం, అంతర్జాతీయ సహకారం కోసం ఆయన చేసిన కృషిని నోబెల్ కమిటీ గుర్తించింది. పొరుగు దేశం ఎరిత్రియాతో సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో ప్రధాని అహ్మాద్ అలీ విశేషంగా కృషి చేసినట్లు నోబెల్ కమిటీ తన ట్వీట్‌లో తెలిపింది.ఏప్రిల్ 2018లో అబే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే ఆయన ఎరిత్రియాతో శాంతి చర్చలకు పునాది వేశారు. ఎరిత్రియా అధ్యక్షుడు అవెరికితో ఆయన కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గత ఏడాది జూలై, సెప్టెంబర్లలో జరిగిన భేటీల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎటువంటి షరతులు లేకుండానే అంతర్జాతీయ బౌండరీ చట్టాలను అమలు చేసేందుకు అబే అంగీకరించారు. ఒకరు ముందుకు వస్తే శాంతి నెలకొనదని, అబే ఇచ్చిన స్నేహ హస్తాన్ని ఎరిత్రియా అధ్యక్షుడు అందిపుచ్చుకున్నారు. శాంతి ఒప్పందం ద్వారా ఇథియోపియా, ఎరిత్రియా దేశ ప్రజల్లో పాజిటివ్ మార్పును తీసుకువస్తుందని నోబెల్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.