కమలాన్ని టార్గెట్ చేసిన జగన్
ఒంగోలు,
జగన్ వైఖరి మారింది. నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీనే తన శత్రువుగా భావించిన వైఎస్ జగన్ క్రమంగా భారతీయ జనతా పార్టీని కూడా టార్గెట్ చేసుకున్నట్లు కనపడుతోంది. తెలుగుదేశం పార్టీతో సమానంగా బీజేపీని కూడా వైఎస్ జగన్ ఎనీమీగానే భావిస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీ తన ప్రధాన శత్రువుగా మారే అవకాశముందని వైఎస్ జగన్ గ్రహించినట్లుంది. అందుకే బీజేపీని కూడా ఇక వదలిపెట్టకూడదని నిర్ణయించుకున్నారు. వైఎస్ జగన్ ఏపీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంతో సత్సంబంధాలు మెరుగుపర్చుకున్నారు.ప్రధాని నరేంద్ర మోడీతో నాలుగుసార్లు సమావేశమైన జగన్ ఆ పార్టీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాల కోసం తాను ప్రయత్నిస్తున్నప్పటికీ రాష్ట్రంలో తన ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచడాన్ని వైఎస్ జగన్ తప్పుపడుతున్నారు. ఉమ్మడి శత్రువుగా ఉన్న చంద్రబాబును వదిలేసి తన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండాన్ని గత కొంతకాలగా వైఎస్ జగన్ సహనంగా పరిశీలిస్తున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లను చేర్చుకోవడంపైన కూడా వైఎస్ జగన్ బీజేపీ పై ఆగ్రహానికి ఒక కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.అందుకోసమే ఇప్పటికే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైఎస్ జగన్ బీజేపీ నేతలు వచ్చినా చేర్చుకోవడానికి రెడీ అయిపోతున్నారు. గతంలో బీజేపీలో ఉండి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణకు ఇప్పటికే పార్టీ కండువాను కప్పేశారు. తాజాగా దగ్గుబాటి పురంద్రీశ్వరిపై జగన్ గురి పెట్టారు. పురంద్రీశ్వరి సయితం వైఎస్ జగన్ సర్కార్ ను ఇరుకున పెడుతూకామెంట్లు చేస్తున్నారు. పురంద్రీశ్వరి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు. పురంద్రీశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆమె తనయుడు హితేష్ చెంచురామ్ లు వైసీపీలో ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ తరుపున పర్చూరు నుంచి, విశాఖ నుంచి బీజేపీ తరుపున ఎంపీగా పురంద్రీశ్వరి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.దగ్గుబాటి వెంకటేశ్వరరావును వైఎస్ జగన్ పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. దగ్గుబాటికి పోటీగా గత ఎన్నికలకు ముందు టిక్కెట్ దక్కక టీడీపీలోకి వెళ్లిపోయిన రావి రామనాధంను వైఎస్ జగన్ తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. రావి రామనాధంకు పర్చూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిని చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. అయితే పురంద్రీశ్వరి బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలోకి రావాలని వైఎస్ జగన్ షరతు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. పురంద్రీశ్వరి వైసీపీలోకి రాకుంటేఇన్ ఛార్జి పదవి నుంచి దగ్గుబాటిని తప్పించే అవకాశముంది. ఒకే కుటుంబం రెండు పార్టీల్లో ఉంటే తప్పుడు సంకేతాలు వెళతాయని వైఎస్ జగన్ అన్నట్లు సమాచారం. పురంద్రీశ్వరిని టార్గెట్ చేసిన వైఎస్ జగన్ బీజేపీని లక్ష్యంగానే చేసుకున్నట్లు స్పష్టంగా కనపడుతుంది.