YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మరాఠలో ఓడలు..బళ్లు అవుతున్నాయా...

మరాఠలో ఓడలు..బళ్లు అవుతున్నాయా...

మరాఠలో ఓడలు..బళ్లు అవుతున్నాయా...
ముంబై,
రాజకీయాల్లో రోజులు ఎల్లకాలం ఓకేలా ఉండవు. ఒకప్పుడు ప్రజల తిరస్కారానికి గురైన పార్టీలు కాలక్రమంలో ప్రజామోదం పొందడం, ఆరంభంలో ప్రజాదరణ ఉన్న పార్టీలు అనంతరం కాలంలో ప్రజల తిరస్కారానికి గురవడం సహజం. వీటిని ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు అని రకరకాల పేర్లతో పిలవవచ్చు. బీజేపీ ఇందుకు నిదర్శనం. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు బీజేపీ పరిమితమైంది. ఒక స్థానం గుజరాత్ నుంచి కాగా రెండోది ఉమ్మడి ఏపీలోని హన్మకొండ. ఇక్కడ కాంగ్రెస్ దిగ్గజాలు పీవీపై బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి గెలిచారు. అలా రెండు స్థానాలకే పరిమితమైన పార్టీ ఇప్పుడు దేశాన్ని దున్నేస్తోంది. ఆసేతు హిమాచలం అంతటా తన హవా చాటుతోంది. జైత్రయాత్ర కొనసాగిస్తోంది.ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్రలోనూ ఒకప్పుడు బీజేపీ పరిస్థితి దయనీయంగా ఉండేది. ఇప్పుడు రాష్ట్రరాజకీయాలను, ఒంటిచేత్తో తన కనుసైగలతో శాసించే పరిస్థితికి చేరుకుంది. దాదాపు 30 ఏళ్ల క్రితమే అంటే 1989లో మహారాష్ట్రలో బీజేపీ ఉనికి నామమాత్రం. శివసేన ఊతంగా రాష్ట్రంలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించింది. బీజేపీ ‘ఆత్మ’గా పేర్కొనే ఆర్.ఎస్.ఎస్ కేంద్ర కార్యాలయం ఈ రాష్ట్రంలోని నాగ్ పూర్ లో ఉన్నప్పటికీ బీజేపీ ప్రభావం సున్నా. నాగపూర్ కాదు కదా రాష్ట్ర వ్యాప్తంగా సొంతంగా తన కాళ్లపై తాను నిలబడే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో హిందుత్వ భావజాలాన్ని ఆపాదమస్తకం వంటిబట్టించుకున్న శివసేనతో సాహిత్యం తనకు మేలు చేస్తుందని గ్రహించి పొత్తు పెట్టుకుంది. రాష్ట్రంలో శివసేన తనకు పెద్దన్నగా భావించింది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 171చోట్ల పోటీ చేయగా, బీజేపీ 117 స్థానాలలో సరిపెట్టుకుంది. నాటి శివసేన అధినేత బాల్ ఠాక్రేకు బీజేపీ పై పెద్దగా భ్రమలు లేవు. అయినప్పటికీ అప్పటికి దాని హిందుత్వభావజాలం కలసివస్తుందని భావించి పొత్తుకు సై అన్నారు. అప్పటి నుంచి బీజేపీకి శివసేన ‘పెద్దన్న’గా ఉండేది. జాతీయ రాజకీయాల్లో శివసేనకు బీజేపీ పెద్దన్నగా ఉండేది.కాలక్రమంలో పరిస్థితి మారింది. మహారాష్ట్రలో బీజేపీ క్రమంగా బలపడసాగింది. శివసేన మరాఠా ఓట్లు కొంకణ్ ప్రాంతంపైనే ఆధారపడగా, బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. కాలక్రమంలో అసలు శివసేన ఉనికిని సవాల్ చేసే స్థాయికి ఎదిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి మొత్తం 288కి గాను 123 స్థానాలు సాధించి సత్తా చాటింది. మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయింది. శివసేన 63 స్థానాలకే పరిమితమైంది. మొదట్లో మద్దతు ఇచ్చేందుకు శివసేన కొంత బెట్టు చేసినప్పటికి తరువాత దిగి వచ్చింది. అనంతరం 2017 ముంబయి నగర పాలక సంస్థ ఎన్నికలలో కమలానికి 82, శివసేనకు 84 లభించాయి. తరువాత జరిగిన ఠాణే, పూణే, ఔరంగాబాద్, నాసిక్, జల్ గావ్, ధూలే, నాగ్ పూర్ నగరపాలక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ సత్తాచాటింది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో తన పరిధిని మరింతగా విస్తరించుకుంది. మొత్తం 48 స్థానాల్లో 23 గెలుచుకుంది. శివసేన 18 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో తానే ‘పెద్దన్న’ పాత్ర స్థాయికి ఎదిగింది. శివసేన తోక పార్టీగా మిగిలిపోయింది. ఒకప్పుడు శివసేన ఆధ్వర్యంలో బీజేపీ పనిచేయగా, ఇప్పుడు కమలం పార్టీ నాయకత్వంలో శివసేన ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయాల్లో మంచి రోజులు రావడం అంటే ఇదే మరి. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం అంటే కూడా ఇదే అని చెప్పవచ్చు.లోక్ సభ ఎన్నికలకు ముందు శివసేన అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంపై అసంతృప్తిగా ఉండేది. సంకీర్ణ ప్రభుత్వాల్లో ఉండి కూడా బీజేపీపై విసుర్లు విసిరేది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత వెనక్కి తగ్గక తప్పలేదు. సీట్ల సర్దుబాటులో బీజేపీ చెప్పినట్లు వినక తప్పలేదు. దీంతో ఈ దఫా మొత్తం 288 స్థానాలకు గాను బీజేపీ అత్యధికంగా 164 స్థానాల్లో పోటీ చేస్తోంది. శివసేన 124 స్థానాలకే పరిమితమైంది. మామూలుగా అయితే చెరి సగం స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది . దీనిని బట్టి ఎవరు ‘పెద్దన్న’ పాత్ర పోషిస్తుందీ అర్థమవుతుంది. అసలు ఒక దశలో ఒంటరిపోరుకే వెళ్లాలని, శివసేనతో పొత్తు వద్దని పార్టీ శ్రేణులు వాదించాయి. అందువల్లే సీట్ల సర్ధుబాటుపై చివరివరకు తేల్చలేదు. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని శివసేనతో కలిసి నడవాలని కమలం పార్టీ నిర్ణయించింది. భవిష్యత్తులో దీనివల్ల ప్రయోజనం ఉంటుందని అంచనా. ఇక పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్నది బీజేపీ వ్యూహం. రాష్ట్రంలో సహకార రంగం బాగా విస్తరించింది. చక్కెర కర్మగారాలు, ఎత్తిపోతల పథకాలు, బ్యాంకులు, ఇలా సహకార రంగంలో 36వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో దాదాపు 2 లక్షల సంస్థలు ఉన్నాయి. 5 కోట్ల మంది సబ్యులున్నారని అంచనా. వీటిపై ఎన్సీపీకి మంచి పట్టుంది. కాంగ్రెస్ కు కూడా బలం ఉంది. ఇక్కడ కమలం బలం నామమాత్రమే. దీంతో ఈ సారి సహకార రంగంపై పట్టు సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. ఈ ప్రక్రియలు విజయవంతమైతే సొంత బలంతో కమలం పార్టీ అధికారం చేపట్టే రోజులు ఎంతో దూరంలో లేవు.

Related Posts