100 కోట్లు కాదు...1000 కోట్లు వేసుకోండి
హైద్రాబాద్,
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్-వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య వార్ మొదలయ్యింది. రవిప్రకాష్ ఆస్తులపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు విజయసాయి లేఖ రాశారు. ఈ లేఖకు రవిప్రకాష్ కార్యాలయం నుంచి కౌంటర్ వచ్చింది. విజయసాయిపై రూ.100కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చిరించారు. తప్పుడు ఆరోపణలతో కొంతమందితో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా ఇలాంటి కుట్రలే చేసినా అవి గాలి కబుర్లేనని తేలిందన్నారు.ఇదిలా ఉంటే రవిప్రకాష్ కార్యాలయం తనపై రూ.100కోట్ల పరువు నష్టం దావా వేస్తామనడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. రవిప్రకాష్, చంద్రబాబును టార్గెట్ చేస్తూ ట్విట్టర్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మీడియాను అడ్డం పెట్టుకుని 15 సంవత్సరాల పాటు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు మీడియా నయీం. చంద్రబాబు అండ చూసుకుని ఎంతో మంది జీవితాలను రోడ్డున పడేశాడు. ఇప్పుడు తనే పెద్ద బ్రేకింగ్ న్యూసై పోయాడు. వంద కోట్లు ఏం ఖర్మ వెయ్యి కోట్లకు వేసుకో పరువు నష్టం దావా’అంటూ కౌంటర్ ఇచ్చారు.గత వారమే టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.18కోట్లు స్కామ్ చేశారనే అలందా మీడియా ఫిర్యాదుతో ఆయన్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అనంతరం అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టు సీజేకు రవిప్రకాష్ ఆస్తులపై దర్యాప్తు చేయించాలని లేఖ రాశారు.