ఫాంపాండ్ తో ఉపాధి బాట
మహబూబ్ నగర్,
వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఎంతో భరోసాను కల్పిస్తోంది. ప్రస్తుతం కూలీలకు అందుతున్న డబ్బులకు అదనంగా చెల్లించేందుకు నిర్ణయించింది. ఉపాధి హామీ పనులు రైతులకు ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయి. హుజూరాబాద్ మండలంలో 19 గ్రామపంచాయతీలు 23 గ్రామాలు ఉన్నాయి. మండలం పూర్తిగా వ్యవసాయాధారితమే కావడంతో చాలా కుటుంబాలు వ్యవసాయంపై ఆదారపడి జీవిస్తున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు కోరుతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫాంఫాండ్ నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంది.పొలాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ఫాం పాండ్ తవ్వుతున్నారు. అవసరమున్నప్పుడు వాడుకునేందుకు కుంటల్లో నిలిచిన నీరు సౌకర్యంగా ఉంటుంది. సమీప బావుల్లో బోర్లలో ఎక్కువ నీరు నిలువ ఉండటంతో భూగర్భ జలాల మట్టం పెరిగి రైతులకు నీటి కొరతను తగ్గిస్తుంది. రైతులకే కాకుండా పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంటుంది. ఉపాధి హామీలో తీస్తున్న మట్టి రైతుల వ్యవసాయ భూముల్లో సారవంతం పెంచేందుకు ఉపయోగకరంగా మారుతుంది. దీంతో రైతుల పంటలకు ఎరువులు అందినట్లుగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరకు రైతులకు ఉపాది హామీ కూలీలను వినియోగించుకునే వెసులుబాటు కలుగలేదు. ఉపాది హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే తమకు మరింత మేలు కలుగుతుందని రైతులు అంటున్నారు. అధిక పెట్టుబడులతో, కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుంసధానం చేయాలని కోరుతున్నారు. ఉపాధి హామీని కేవలం ఎండాకాలంలోనే ఎక్కువ పని దినాలను కల్పించకుండా అదికారులు స్పందించి వ్యవసాయానికి అనుసందానం చేసి సంవత్సరంలో కనీసం 200 రోజుల పని కల్పించాలని కోరుతున్నారు.మహాత్మా గాందీ జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతులకు మేలు చేసే పథకాలు అనేకం ఉన్నా, వాటి గురించి రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి. ఉపాది హామీ పథకం ద్వారా నీటి కుంటలను తవ్వించుకోవడంతో పాటు, ఫాం పాండ్‌ల నిర్మాణాలు, పాడి పశువు ఉన్న రైతులకు పాక నిర్మాణాలను నిర్మించుకోవడానికి పథకం ఎంతగానో దోహదం చేస్తుంది.