YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

తెలంగాణ  మచ్చల గిత్తకు గుర్తింపు

తెలంగాణ  మచ్చల గిత్తకు గుర్తింపు

తెలంగాణ  మచ్చల గిత్తకు గుర్తింపు
హైద్రాబాద్, 
తెలంగాణకు ప్రత్యేకంగా ఓ బ్రాండ్ ఉండాలనే ఉద్దేశంతో మచ్చల గిత్తకు గుర్తింపు సాధించేందుకు చేస్తున్న పరిశోధన ప్రతిపాదన ఎన్‌బిఎజిఆర్‌కు చేరింది. ఏ పశు జాతులకైనా జాతీయ జంతు జన్యు పరిశోధన సంస్థ అధికారిక గుర్తింపునిస్తుంది. అది పశువులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని సేకరిస్తుంది. ఆ సంస్థ నియమాల మేరకు రాష్ర్ట జీవవైవిధ్య సంస్థ ఆర్థిక సహకారంతో పశుసంవర్థక శాఖ, మరో స్వచ్ఛంద సంస్థతో కలిసి నివేదిక రూపొందించింది. ప్రాంతం, భౌగోళిక పరిస్థితులు, భిన్నత్వం వంటి వివరాల్ని నివేదికలో పొందుపరిచారు.ప్రస్తుతం నివేదిక ఎన్‌బిఎజిఆర్‌కి చేరిందని, త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉందని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ర్ట పక్షి పాలపిట్ట, రాష్ర్ట జంతువు జింక.. రాష్ర్ట ఎద్దుగా తూర్పు జాతి గిత్త అవతరించనుంది. దీన్నే ‘మచ్చల గిత్త’, ‘అమ్రాబాద్ పొడ’ అని కూడా పిలుస్తారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వీటి ఉనికి కనిపిస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్, లింగాల, అచ్చంపేట, పదర మండలాల్లో మొత్తం 15,076 తూర్పు జాతి ఎద్దులున్నాయి. వీటిలో ఎంపిక చేసిన 101 మందల్లోని 3,997 పశువుల వయస్సు, లింగం, సామర్థ్యం, లక్షణాలపై అధికారులు సర్వే చేశారు.15,076 ఎడ్లలో అత్యధికంగా లంబాడీల వద్ద 10,964, యాదవుల వద్ద 2,848, ఎస్సీల వద్ద 1,264 ఉన్నట్లు గుర్తించారు. రాష్ర్టవ్యాప్తంగా ఈ జాతి పశువులు సుమారు 30 వేలదాకా ఉంటే సగానికిపైగా లంబాడీల వద్దే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు అవసరమైన అన్ని అర్హతలు ఈ పశు జాతికి ఉన్నాయని పశుసంవర్థక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎన్‌బిఎజిఆర్ నుంచి గుర్తింపు లభిస్తేనే తూర్పుజాతిని అభివృద్ధి చేయడం వీలవుతుందని, అప్పటిదాకా జాతి కలుషితం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Related Posts