YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

నవీన్ సీక్రెట్ అదేనా

నవీన్ సీక్రెట్ అదేనా

నవీన్ సీక్రెట్ అదేనా
భువనేశ్వర్, 
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విలక్షణమైన రాజకీయ నేత. ఆయన తన రాష్ట్ర సరిహద్దులు దాటి రాజకీయం చేయరు. జాతీయ రాజకీయాల్లో కూడా వేలుపెట్టరు. ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన నవీన్ పట్నాయక్ రాష్ట్రాభివృద్ధిపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాగా నవీన్ పట్నాయక్ ప్రచారానికి దూరంగా ఉంటారు.ఇరవై ఏళ్లకు పైగానే ముఖ్యమంత్రిగా చేసినా నవీన్ పట్నాయక్ పై ఒడిశా ప్రజలకు బోరు కొట్టలేదు. మరోసారి ఆయనకు అప్రతిహత విజయాన్ని అందించి పెట్టారు. ఐదు సార్లు విజయం సాధించినా నవీన్ పట్నాయక్ ఇప్పటి వరకూ జాతీయ రాజకీయాల జోలికి పోలేదు. ఆయన రాష్ట్రాభివృద్దికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడంతో నవీన్ పట్నాయక్ మోడీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంటు ఎన్నికల్లోనూ నవీన్ పట్నాయక్ భారతీయ జనతా పార్టీనే ఎదుర్కొన్నారు. ఒడిశాలో కాంగ్రెస్ పరిస్థితి క్షీణించడంతో బీజేపీ బలపడింది. దీంతో రెండు ఎన్నికల్లోనూ నవీన్ పట్నాయక్ ప్రత్యర్థిగా బీజేపీయే ఉంది. ఎన్నికల సమయంలో పరస్పర విమర్శలు సహజం. నవీన్ పట్నాయక్ ఎన్నడూ వ్యక్తిగత విమర్శలకు దిగలేదు. నరేంద్ర మోడీని కాని, అమిత్ షాను కాని వ్యక్తిగతంగా తన ఎన్నికల ప్రచారంలో దూషించలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఒడిశాకు చేస్తున్న అన్యాయంపైనే ఆయన ఎక్కువగా ప్రశ్నించారు.
ఇక మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నవీన్ పట్నాయక్ కేంద్రంతో సత్సంబంధాలు మెరుగుపర్చుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీతో నాలుగు సార్లు భేటీ అయ్యారు. నిత్యం తుపాను, వరదలతో అల్లాడే రాష్ట్రం కావడంతో కేంద్రం సాయం ఒడిశాకు నిత్యం అవసరముంటుంది. ఆ కోణంలోనే నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వంతో కయ్యానికి దిగడం లేదు. సమస్యలను చాలా స్మూత్ గా డీల్ చేస్తున్న నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వ పథకాలను సయితం రాష్ట్రంలో అదే పేరుపై అమలు పరుస్తారు. స్టిక్కర్లు మార్చి ప్రచారం చేసుకోరు. అందుకే నవీన్ పట్నాయక్ పట్ల మోడీకి కూడా సాఫ్ట్ కార్నర్ ఉందన్నది వాస్తవం.

Related Posts