కశ్మీర్ లో మళ్లీ మొబైల్ సేవలు
శ్రీనగర్,
జమ్మూ కశ్మీర్‌లో మొబైల్ సేవలను కేంద్రం సోమవారం పునరుద్ధరించింది. దీంతో కశ్మీర్ లోయలో 72 రోజుల తర్వాత మొబైల్ సేవలపై ఆంక్షలను సడలించినట్టయ్యింది. అన్ని నెట్‌వర్క్స్‌కు చెందిన పోస్ట్‌పెయిడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నుంచి 40 లక్షల పోస్ట్-పెయిడ్ మొబైల్ సేవలు ప్రారంభమవుతాయని తెలియజేశారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసిన తర్వాత ఆగస్టు 5 నుంచి అక్కడ మొబైల్ సేవలపై ఆంక్షలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కశ్మీర్‌లో ఆగస్టు 5 తర్వాత తిరిగి అక్టోబరు 14న మొబైల్ సేవలు ప్రారంభమయ్యాయి.ఆర్టికల్ 370 రద్దుకు ముందే టెలిఫోన్, మొబైల్ సేవలను నిలిపివేసిన అధికారులు.. ఆగస్టు 17, సెప్టెంబరు 4న రెండు విడతల్లో ల్యాండ్‌లైన్ల పునరుద్ధరించారు. లోయలో మొత్తం 50 వేల ల్యాండ్ లైన్లు పనిచేస్తున్నట్టు ప్రకటించారు. ఇక, జమ్మూ రీజియన్‌లో కొద్ది రోజుల్లోనే ల్యాండ్‌లైన్, మొబైల్ సేవలను ప్రారంభించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను దుర్వినియోగం చేస్తూ వదంతలను వ్యాపింపజేయడంతో ఆగస్టు 18న నిలిపివేశారు.నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్ మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా సహా పలువురు నేతలు మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. వారి విడుదల విషయంలో ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన లాంటి పరిణామాల నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 5 నుంచి వారి నిర్బంధం కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడేంత వరకు వారిని విడుదలచేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారి విడుదలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతా లేదని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. విడుదల ఎప్పుడనేది ఇప్పట్లో చెప్పడం కష్టమని ఆయన పేర్కొన్నారు.మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాను నిర్బంధించి.. వేర్వేరు చోట్ల ఉంచగా, ఫరూఖ్ అబ్దుల్లాను ఆయన నివాసంలోనే గృహనిర్బంధం చేశారు. వీరితోపాటు కశ్మీర్ లోయలోని ఇతర పార్టీలకు చెందిన నేతలను సైతం అదుపులోకి తీసుకోగా.. వారి సంఖ్య ఎంత అనేది ప్రభుత్వ వర్గాలు ఇంత వరకు వెల్లడించలేదు. అనధికారింగా ఈ సంఖ్య 2వేల వరకు ఉంటుందని అంచనా.