బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ
ముంబై,
భారత్ జట్టుకి దూకుడు నేర్పిన కెప్టెన్‌గా పేరొందిన సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా ఎన్నికవడం దాదాపు ఖాయమైంది. బీసీసీఐ సభ్యత్వం ఉన్న రాష్ట్ర క్రికెట్ సంఘాలు తాజాగా ముంబయిలో సమావేశమై.. అధ్యక్షుడిగా దాదా పేరుని ఖారారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సౌరవ్ గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా తాను ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే.. అతనికి బీసీసీఐ మాజీ అధ్యక్షులు శ్రీనివాసన్, అనురాగ్ ఠాకూర్ బృందం నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ.. ఎట్టకేలకి వ్యూహాత్మకంగా అందరి మద్దతు కూడగట్టిన గంగూలీ.. అధ్యక్ష పదవి రేసులో ముందు నిలిచాడు.ఇప్పటికే బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా రెండో పర్యాయం పనిచేస్తున్న గంగూలీ.. బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం 2020, సెప్టెంబరు తర్వాత అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం.. బీసీసీఐలో రెండు పర్యాయాలు ఏ పదవులైనా చేపట్టిన తర్వాత సభ్యులు కనీసం మూడేళ్లు విరామం తీసుకోవాల్సి ఉంటుంది.వాస్తవానికి శ్రీనివాసన్‌కి అనచరుడిగా ఉన్న బ్రిజేస్ పటేల్ బీసీసీఐ అధ్యక్షుడవుతాడని అంతా ఊహించారు. కానీ.. కొన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలు అతడికి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో.. గంగూలీ రేసులో ముందుకొచ్చాడు. బోర్డులో లోధా కమిటీ సిఫార్సుల అమలు, క్రికెట్ పాలకుల కమిటీ అతి జోక్యంతో గాడి తప్పిన బీసీసీఐ పాలనని గంగూలీ అయితేనే మళ్లీ గాడిన పెట్టగలడని రాష్ట్ర క్రికెట్ సంఘాలు పక్కా వ్యూహంతో.. అతడికి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది.