బంద్ కు జనసేన మద్దతు
హైద్రాబాద్
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పెరుగుతోంది. ఆర్టీసీ సమ్మెకు ఓయూ విద్యార్థి జేఏసీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ జేఏసీ ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఈ బంద్‌కు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చిన తరుణంలో.. కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు.ఖమ్మంలో శ్రీనివాస రెడ్డి, హైదరాబాద్ రాణిగంజ్‌లో సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికులు ఆత్మార్పణం చేసుకోవడం బాధాకరమన్న పవన్.. ఇకపై ఇలాంటి బలిదానాలు జరగొద్దన్నారు. 48 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం సరికాదన్న జనసేనాని.. కేసీఆర్ వ్యాఖ్యల వల్ల ఉద్యోగ వర్గాల్లోనే కాదు సాధారణ ప్రజానీకంలోనూ ఆవేదన కనిపిస్తోందన్నారు.ఉద్యోగ భద్రత లేకుండా పోయింది అనే ఆందోళన అందరిలో కలిగిందన్న పవన్ కళ్యాణ్... ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం తక్షణం చర్చలు జరపాలన్నారు. సమ్మె జఠిలం కాకుండా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.