ముఖ్యమంత్రి ప్రకటనల తర్వాతనే ఆత్మహత్యలు సాగుతున్నాయి
మా ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని సూసైడ్నోట్లో రాసారు
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి - ఆత్మహత్యలను ఆపండి
హైదరాబాద్,
చట్టబద్దమైన ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చట్టవిరుద్ధంగా ముఖ్యమంత్రి వ్యవహరించడం వల్లనే తెలంగాణలో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మూడు రోజుల్లో ఆర్టీసీలో 100శాతం బస్సులు తిప్పుతామని, విద్యాసంస్థలకు సెలవులిచ్చి, ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు కార్మికులను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసిన వార్తను చూస్తూనే శ్రీనివాస్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ దిగ్భ్రాంతి నుండి తేరుకోకముందే హైద్రాబాద్లో సురేంద్రగౌడ్ ఆత్మహత్య చేసుకోవడం ముమ్మాటికి ప్రభుత్వం చేస్తున్న హత్యలేనని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ''మా చావుకు ప్రభుత్వమే కారణం''అని సూసైడ్నోట్లో చనిపోయిన కార్మికులు పేర్కొన్నా, ఆర్గురు ఆత్మబలిదానాలు ఇచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రిలో చలనం రాకపోవడం ఆయన అహంభావానికి, నిరంకుశత్వానికి పరాకాష్ట అని పేర్కొంటూ సురేంద్రగౌడ్ భౌతిక కాయం వద్ద బాధాతప్త హృదయంతో నివాళులర్పించారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని, ప్రజలు మీకు అండగా ఉన్నారని, ధైర్యంగా పోరాడాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రజలు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమ్మెకు సంపూర్ణ అండదండలిస్తున్నారు. సంస్థను ప్రయివేటీకరణ చేసి వేల కోట్ల ఆర్టీసీ ఆస్థులను ప్రయివేటు సంస్థలకు దారాదత్తం చేసి తన అనుయాయులు లబ్ధిపొందడానికే ముఖ్యమంత్రి కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో ప్రధానిని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి నిరంకుశ పోకడలు మరింత పెరిగాయి. కేంద్రం తెచ్చిన మోటారు వాహనాల చట్టం 2019, కేసీఆర్ ప్రయివేటీకరణ రెండూ తోడై ప్రజా రవాణాను పెద్దల రవాణాగా మార్చే కుట్రతోనే కార్మికులపై ఉక్కుపాదం మోపారు. ప్రజాస్వామ్యబద్దంగా వ్యహరించాల్సిన ప్రభుత్వం నిజాం నిరంకుశత్వాన్ని తలపించేలా వ్యవహరించడం క్షంతవ్యం కాదని, ఇప్పటికైనా మరణించిన కార్మికులు కోరుకున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్ చేసారు. ఆర్టీసీ కార్మికులకు అండగా మరింత ఉధృతమైన పోరాటాలు చేయాలని సీపీఐ(ఎం) శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
సురేంద్రగౌడ్ భౌతికకాయం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర బృందంలో తమ్మినేనితో పాటు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు, బి వెంకట్, హైదరాబాద్ సౌత్ కమిటీ నాయకులు లక్ష్మమ్మ, నాగేశ్వరరావు, మీన తదితరులు ఉన్నారు.