YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమృత హస్తం ఖాళీ..? (కడప)

అమృత హస్తం ఖాళీ..? (కడప)

అమృత హస్తం ఖాళీ..? (కడప)
కడప,  అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఇస్తున్నారంటూ ఇటీవల నెలరోజులు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన పాలకులు ఇప్పుడు తల్లీ, బిడ్డలకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. నిన్నటి వరకు అమృతహస్తం నిలిచిపోగా ప్రస్తుతం తల్లీ బిడ్డలకు ఇచ్చే పాలు కూడా దూరమయ్యాయి. త్వరలో కోడిగుడ్ల సరఫరా కూడా ఆగిపోయే పరిస్థితి ఉందని భావిస్తున్నారు. కడప అర్బన్‌ ప్రాజెక్టు పరిధిలో వారం రోజులకే సరిపోయేలా కోడిగుడ్లు ఇచ్చిన వైనంపై పలువురు అంగన్వాడీ కార్యకర్తలు నివ్వెరపోతున్నారు.  జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో పాలు నిండుకున్నాయి. జిల్లాలోని 15 సమగ్ర శిశు సేవా పథకం ప్రాజెక్టుల కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాజెక్టుల్లో మాత్రం పాలను సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నా రోజు రోజుకూ నిల్వలు నిండుకోవడంతో తల్లులు, బిడ్డలు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని 15 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో గర్భిణులు 21,552 మంది, మరో 22,678 మంది బాలింతలు, మూడేళ్లపైబడి చిన్నారులు 71,618 మంది అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారు. వీరితో పాటు ఆరు నెలల నుంచి మూడేళ్లలోపున్న 96,771 మంది చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో లభించే పౌష్టికాహారం తీసుకుంటున్నారు. పాలు, కోడిగుడ్లు, ఎంపిక చేసిన ప్రాంతాల్లో బాల సంజీవినితో పాటుగా బాలామృతం కూడా ఇస్తున్నారు. బాల సంజీవిని పథకంలో చెనిక్కాయ ఉండలు, సున్నుండలు వంటి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీ నుంచి బాల సంజీవిని పథకం ఆగిపోయింది. ప్రస్తుతం పాల సరఫరా కూడా ఆగిపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో బాలింత, గర్భిణులకు రోజుకు వంద మిల్లీ లీటర్ల పాలు ఇస్తున్నారు. రక్తహీనతతో ఉన్న తల్లులు, గర్భిణులకు అదనంగా కూడా పాలు ఇస్తున్నారు. ప్రతినెలా గుత్తేదారులు నెలకు సరిపడా సరకులను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తారు. ఇంత వరకు పాలు సరపడా కేంద్రాలకు సరఫరా కాకపోవడంతో లబ్ధిదారులతో పాటుగా కార్యకర్తలు కూడా ఆందోళనలో ఉన్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పౌష్టికాహారాన్ని లబ్ధిదారులకు సకాలంలో సరఫరా చేసేలా చూడాలని పలువురు కార్యకర్తలు కోరుతున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలను ప్రశ్నిస్తున్నారని గతంలో బాల సంజీవిని అందిచేవారని ఇప్పుడు అందించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారని తాజాగా పాలు కూడా రాకపోవడంతో మాపై ఒత్తిడి పెరిగిందని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం పౌష్టికాహార కేంద్రాలుగా అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేలా బాల సంజీవిని, పాలు, కోడిగుడ్లు సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.

Related Posts