YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మూగ రోదనే..

మూగ రోదనే..

మూగ రోదనే.. (కరీంనగర్)
కరీంనగర్, : జిల్లాలోని పశువులకు మూగరోదన తప్పడం లేదు.  ప్రభుత్వం పాడికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నా ఆచరణలో మాత్రం పేలవమే. తొమ్మిది నెలలుగా నిధుల్లేవ్‌.. మందుల్లేవు.. పథకాల ఊసే లేదు. పశు వైద్యశాలల్లో వైద్యులు, సిబ్బంది విధులకు రావడం, వెళ్లడం తప్పా చేసిందేమి లేదన్నది సుస్పష్టం.. పాడి పరిశ్రమకు దన్నుగా నిలవాల్సిన శాఖ నిధుల్లేక అంపశయ్యపై శయనిస్తుంటే పాడి రైతులకు దిక్కెవరని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం జిల్లా ఆసుపత్రుల్లోనూ మందులు కరవవడంతో పశు వైద్యులు ప్రిస్క్రిప్షన్‌ రాసి మందులను బయట కొనుగోలు చేయాలని నిర్దేశిస్తున్నారు. పాడి రైతులు, గొర్రెలు, మేకల కాపరులు వివిధ చికిత్సల నిమిత్తం జిల్లా కేంద్రంతో పాటు పశువైద్యాలయాలను ఆశ్రయిస్తే మందులు కరవవుతున్నాయి. వైద్యులు మందుల చీటీ రాస్తే బయట ప్రైవేట్‌ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. వారి అవసరాన్ని ఆసరా చేసుకున్న దుకాణదారులు ధరలను పెంచుతున్నారు. సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు కరీంనగర్‌ జిల్లా పశువైద్యాలయమే దిక్కు.. కానీ వైద్యం అందించేందుకు అసలు మందులే లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో పశువుల్లో నీలి నాలుక వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.. దీనికితోడు వర్షాలు పడుతున్నందున మెత్తకాళ్ల రోగం వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీజన్‌ వారీగా మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా మొక్కుబడిగా వ్యవహరించడం విడ్డూరం.
నూతనంగా నిర్మించిన జిల్లా పశువైద్యశాల పరిస్థితి అధ్వానంగా మారింది. వైద్యులు, సిబ్బంది ఉండగా ఉన్న పరికరాలు నిరుపయోగంగా మారడం విచిత్రం.. రోగ నిర్ధారణ పరికరం అలంకారప్రాయంగా మిగిలిపోయింది. లక్షలు వెచ్చించి కేటాయించిన హిమలైజర్‌ పరికరం నిర్వహణలో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. పశువులకు అవసరమైన గైనకాలజీ విభాగంతో పాటు సర్జరీ, మెడిసిన్‌ ఓపీ(ఔట్‌ పేషంట్‌) విభాగాలు, ఎక్స్‌రే, సీటీ స్కానింగ్‌, అల్ట్రాసౌండ్‌ విభాగాలతో పాటు ఆపరేషన్‌ థియేటర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే మేకలు, గొర్రెలు, చిన్న పశువులు, కుక్కలు అవసరమైన ఇన్‌పేషెంటు వార్డును ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా రోగ నిర్ధారణ చేసేందుకు డిజిటల్‌ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ యంత్రం, ఎముకలకు సంబంధించిన వ్యాధిని గుర్తించేందుకు ఫిహమ్‌ యంత్రం, బయో కెమికల్‌ అనలైజర్‌, బ్లడ్‌ అనలైజర్‌, ఈసీజీ మిషన్‌, పశువుల పళ్లకు సంబంధించి డెంటల్‌ స్కేలర్‌, సర్జికల్‌ పరికరాలు, హిమటాలోజికల్‌ మీటర్‌ వంటివి ఏర్పాటు చేయాల్సి ఉండగా ఏ ఒక్క యంత్రం లేదు. ఉమ్మడి జిల్లాస్థాయి రెఫరల్‌ ఆసుపత్రి కావడంతో అన్ని విభాగాలకు చెందిన స్పెషలిస్టుల అవసరం ఉంది. జిల్లా పశువైద్యశాలతో పాటు నియోజకవర్గ ఆసుపత్రులు, మండల స్థాయి ఆసుపత్రులు, ఉప కేంద్రాలకు మూడు నెలలకోసారి మందులను సరఫరా చేయాల్సి ఉంది. కానీ 9 నెలలు గడిచినా మందుల ఊసే లేదు. ప్రతి మూడు నెలలకు జిల్లా ఆసుపత్రికి రూ.లక్ష, ఇతరవాటికి మొత్తంగా క్వార్టర్‌(3నెలలు)కు రూ.10లక్షలు కేటాయించేది. గతేడాది కూడా ఒకసారి మాత్రమే మందులు వచ్చాయని వైద్యులు చెబుతున్నారు. జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబర్‌ మాసాల్లో నిధులు రావాల్సి ఉండగా ఆ ఊసే లేకపోవడంతో రైతులకు అదనపు వ్యయం భారంగా మారింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార పశువైద్య వాహనం ఏర్పాటు చేయగా అవీ నామమాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా 1962 నంబర్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో వాహనంలో పశువైద్యాధికారితో పాటు వెటర్నరీ అసిస్టెంట్‌, అటెండర్‌, డ్రైవర్‌ ఉండగా రెండు నెలలుగా సరిపడా మందులు లేకపోవడంతో ఏదో ఉన్నామా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

Related Posts