YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

వైద్యం కాదు వ్యాపారం..

వైద్యం కాదు వ్యాపారం..

వైద్యం కాదు వ్యాపారం.. (ఖమ్మం)
ఖమ్మం,: జిల్లాలోని ప్రైవేటు వైద్యరంగం వైద్యో నారాయణ హరి అన్న నానుడిని తిరగేసి కమీషన్ల వ్యవస్థను ప్రవేశపెట్టి రోగులను ఆదాయ వనరుగా మారుస్తున్నారు. మల్టీస్పెషాలిటీలు, కార్పొరేట్‌ వైద్యం పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. కాసులకు కక్కుర్తిపడి రోగుల ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నాయి. కొన్ని ఆసుపత్రులకు అనుమతులు లేకున్నా రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న యాజమాన్యాలు నిబంధనలేమీ పట్టించుకోకుండా స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. వైద్య వృత్తిపై కనీస పరిజ్ఞానం లేని వారితో పాటు వ్యాపారమే పరమావధిగా భావిస్తున్న కొందరు వైద్యులు నడుపుతున్న ఆసుపత్రుల్లో ఈ పరిస్థితి నెలకొందని ఆ రంగం నిపుణులు సైతం అంటున్నారు. లాభాపేక్షే తప్ప సేవా దృక్పథం మచ్చుకైనా ఆసుపత్రుల్లో కన్పించడం లేదు. ఆసుపత్రి బోర్డుల్లో వైద్యుల పేర్లను ప్రదర్శిస్తూ వారు లేకుండానే జనం నాడి పట్టిస్తున్న తీరు నివ్వెరపరుస్తోంది. కార్పొరేట్‌ స్థాయిలో కనిపించే హంగులను చూసి రోగులు కూడా నిండు ప్రాణాలను వారి చేతుల్లో పెడుతున్నారు. ఏవైనా సంఘటనల అనంతరం ఆసుపత్రులను తనిఖీ చేస్తున్న వైద్యాధికారులు అక్కడ పరిస్థితులను చూసి నివ్వెరపోతున్నారు. ఆసుపత్రులకు అనుమతులు పొందే సమయంలో నిర్దేశించిన నిబంధనలను యాజమాన్యాలు పాటించడం లేదు. వైద్యుల, సిబ్బంది అర్హత పత్రాలు పరికరాల ఏర్పాటు వివరాలను ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖకు తెలియచేయాలి. అనుమతులు తీసుకున్న తర్వాత ఈ విషయాలను పట్టించుకుంటున్న ఆసుపత్రులు ఒక్కటి కూడా లేవనే చెప్పాలి. ఇక అగ్నిమాపక అనుమతులు తీసుకోని ఆసుపత్రులు 80 శాతానికి పైగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్ఛు జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 361 ప్రయివేటు ఆసుపత్రులు ఉన్నాయి. ఇవే కాకుండా ఇరుకు సందులు, రద్దీ వీధుల్లో బోర్డులు తగిలించినవి మరో 40 వరకు ఉంటాయి. వీటికి ఎలాంటి అనుమతి పత్రాల లేకపోయినా రోగుల ప్రాణాలకు కనీస భరోసా కల్పించకుండా అన్ని రకాల శస్త్రచికిత్సలు చేస్తున్నారు. కొన్నింట్లో ఏకంగా ఆర్‌ఎంపీ, మెడికల్‌ ప్రాక్టీషనర్లే వైద్యుల అవతారమెత్తుతున్నారు. రష్యా ఎంబీబీఎస్‌ వైద్యులు తప్పనిసరిగా ఐఎంసీ రిజిస్టేషన్‌ కలిగి ఉండాలి.
ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్‌, రికార్డులు కన్పించవు. వైద్య సిబ్బంది, ఔట్‌ పేషెంట్ల వివరాలు ఉండవు. వైద్యులు, పారా మెడికల్‌, నర్సింగ్‌ సిబ్బంది అంశాలను వైద్యారోగ్యశాఖకు నివేదించాలి. కొత్తగా వైద్యుడు, ఇతర సిబ్బంది వచ్చారనే అంశాన్ని తప్పనిసరిగా తెలియజేయాలి. ఆయా వివరాలను ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్న ఆసుపత్రి ఒక్కటి కూడా లేదు. పట్టికలో స్పెషలిస్టులను చూపుతున్న ఆసుపత్రుల్లో సైతం సాధారణ వైద్యులే సేవలందిస్తున్నారు. వచ్చీరానీ వైద్యంతో కొందరు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వైద్య సేవలు, ఫీజుల పట్టికను రోగులకు అర్థమయ్యేలా ఆసుపత్రి, ల్యాబ్‌ పరిసరాల్లో ప్రదర్శించాలి. వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, ల్యాబ్‌, పారామెడికల్‌ సిబ్బంది పేర్లు, రిజిస్టేషన్‌ నంబర్లు, అర్హతలను ప్రదర్శించాలి. జీవ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పాటించాలి. శస్త్రచికిత్సల గదులు 120 నుంచి 200 చదరపు అడుగల వైశాల్యంలో ఉండాలి. నిబంధనల ప్రకారం వాటిలో అన్ని వసతులు కల్పించాలి. అవసరమైన పరికరాలు, అత్యవసర మందులు ఉండాలి. వ్యాధి నిర్ధారణ కేంద్రంలో వైద్యులు, కనీస అర్హత కలిగిన ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉండాలి. అధికారులు విధిగా తనిఖీలు నిర్వహిస్తే ఆసుపత్రుల డొల్లతనం ఇట్టే బయటపడుతుంది. ఎవరో ఒకరు ఏదో ఒక ఆసుపత్రిపై ఫిర్యాదు చేసినపుడో లేదంటే ఉన్నతాధికారులు ఒత్తిడి చేసినపుడో అరకొర తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులుపుకొంటున్నారు.

Related Posts