అడిగితే చాలు వరాలే... మారుతోన్న జగన్ వ్యవహారశైలీ
విజయవాడ,
జగన్ వరాలదేవుడిగా మరిపోయారు. ఆయనకు ఈ వయసులో ఇంత కరుణ, దయ ఎలా వచ్చిందో తెలియదు కానీ అడిగిన వారికి లేదనకుండా అలా వరాలు ఇచ్చేస్తున్నారు. ఆ విషయంలో పరమశివుడుగా మారి శత్రువులకు సైతం వరాలు ఇచ్చేంతగా జగన్ ఎదిగిపోయారు. మరి అది భస్మాసురహస్తమై నాడు శివుని కొంప ముంచేసింది. మరి జగన్ రాజకీయాలను సైతం పక్కన పెట్టి పచ్చి ప్రత్యర్ధులకు సైతం వరాలు ఇచ్చేశారు. వర్తమాన రాజకీయాలను పరిశీలిస్తున్న వారు జగన్ చేసింది రైటా? రాంగా? అని చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు విషయంలోనూ జగన్ ఉదారత ఏ విషమ పరిస్థితిని తెస్తుందోనని కూడా విశ్లేసిస్తున్నారు.అందరికీ వరాలు ఇచ్చిన జగన్ చంద్రబాబుకు ఇచ్చిన వరం ఏంటా అన్న ఆలోచన కలగడం సహజం. చంద్రబాబుకు జగన్ ప్రతిపక్ష నాయకుడు పోస్ట్ ఇచ్చారు. జగన్ ఇవ్వడమేంటి, ప్రజలు ఇచ్చారు కదా అని మరో డౌట్ రావచ్చు ఈ రోజుల్లో ఒక్కసారి ఓటు వేసిన తరువాత ప్రజల పాత్ర ఏముంది కనుక. మెజారిటీ సీట్లు వచ్చిన వారినే ఇంటికి పంపించేస్తున్న దారుణమైన రాజకీయాలు నడుస్తున్న రోజులివి. అంతవరకూ ఎందుకు చంద్రబాబు విషయానికే వస్తే ఆయన తన సొంత మామ, ఎన్టీఆర్ బంపర్ మెజారిటీతో 1994లో గెలిస్తే గట్టిగా ఎనిమిది నెలలు తిరగకుండానే ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన ఘటన కళ్లముందే ఉంది. ఇక వైఎస్ జగన్ 2014లో 67 ఎమ్మెల్యే సీట్లు తొమ్మిది మంది ఎంపీలను గెలుచుకుంటే అందులో కూడా కన్నం పెట్టి 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను తనవైపు తిప్పుకున్న ఘనుడు చంద్రబాబు. మరి అటువంటి చంద్రబాబు ఇపుడు జగన్ మీద కస్సుమంటున్నారు. తెగ నీతులు వల్లిస్తున్నారు. దీనికంతటికీ కారణం జగన్ బాబు విషయంలో గట్టిగా ఓ చూపు చూడకపోవడమేనని వైసీపీ మంత్రులే అంటున్నారు. జగన్ నీతి నియమం అంటూ పాతకాలం నాటి రాజకీయం చేయడం వల్లనే బాబుకు ఇప్పటివరకూ ప్రతిపక్ష హోదా మిగిలింది అంటున్నారు. ఆ హోదాతోనే బాబు ఇపుడు జగన్ మీద రెచ్చిపోతున్నారని కూడా అంటున్నారు.జగన్ ని నానా మాటలు అంటున్న చంద్రబాబు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇపుడు బాబు అనుభవిస్తున్న విపక్ష హోదా అనేది జగన్ ఇచ్చిన రాజకీయ బిక్ష అంటున్నారు విశాఖకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు. జగన్ కనుక గట్టిగా తలచుకుంటే బాబు, ఆయన బావమరిది బాలయ్య తప్ప టీడీపీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరని కూడా అవంతి అంటున్నారు. తెల్లారిలేస్తే జగన్ మీద విరుచుకుపడుతున్న బాబు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలు జగన్ ని ఏమీ అనలేరని కూడా అవంతి అంటున్నారు. నిజంగా వర్తమాన రాజకీయాలో జగన్ చేసిన ఈ పని ప్రశంసనీయమైనా కూడా చంద్రబాబు వంటి గండరగండడు రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్నపుడు జగన్ ఇలా ఉదారంగా వ్యవహరించడం రాజకీయంగా తప్పేమోనని వైసీపీలోనే మధనం జరుగుతోంది. ఇదే చంద్రబాబు అధికారంలోకి వస్తే కనుక ఈపాటికి జగన్ పార్టీ మొత్తాన్ని ఖాళీ చేయించి ఏకంగా జైలుకే పంపేవారని కూడా అంటున్నారు. ఈనాటి రాజకీయానికి తగినట్లుగా జగన్ పావులు కదపకపోవడం వల్లనే నాలుగు నెలల వ్యవధిలోనే బాబు ఏకు మేకులా మారి జగన్ సర్కార్ ని ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్నారని అంటున్నారు. మరి మంత్రి అవంతి లాంటి వారి మాటలు విని జగన్ కనుక పునరాలోచన చేస్తే మాత్రం బాబు టీడీపీ కధ కంచికేనని కూడా రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చూడాలి రాజకీయాలలో ఎపుడేం జరుగుతుందో ఎవరూ వూహించలేరు