స్మరణ సులభుడు పరమాత్మ
నవవిధ భక్తుల రీతులలో ‘స్మరణ’ ప్రత్యేకమైనది. భగవంతుడు స్మరణవశుడు. ఈ విషయాన్ని గీతాచార్యుడు ‘గీత’లో స్పష్టంగా చెప్పాడు.
‘‘ అనన్య చేతా స్సతతం యో మాం స్మరతి నిత్యశః
తస్యాహం సులభః పార్థ నిత్య యుక్తస్య యోగినః
‘‘అర్జునా! ఏకాగ్ర చిత్తుడై ఎవడు, అనుదినం నిరంతరం జీవితాంతం, నన్ను స్మరిస్తాడో, అట్టివారికి నేను సులభ లభ్యుడిని. అలా చింతన చేసిన వారి యోగ క్షేమాలను నేను స్వయంగా వహిస్తాను.’’ అని దీని అర్థం.
తరించడానికి ఏ మాత్రము పనికిరాని ఆలోచనల్ని నెట్టేసి, భగవత్ సంబంద భావాల్ని మాత్రమే ఆలోచిస్తూ మనసుని పరమాత్మయందే లగ్నము చేయాలి. ఇందుకు ధ్యానం సహకరిస్తుంది. ఈ అభ్యాస యోగం వల్ల అంత్యకాలంలో.. తుది ఘడియల్లో.. అనాలోచితముగానే దైవస్మరణతో కైవల్యము పొందగలరు. ఇది అంత సులభమా? అంటే.. ఔను సులభమే.
మనో వాక్కాయ కర్మలయందు- చేసే ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, నిద్రావస్థలో, జాగరూకతలో, స్వప్నావస్థలోనూ భగవన్నామ స్మరణను ఆత్మకుఅభ్యసనం చేయించాలి.
ఒక తల్లి తన చిన్నారి శిశువుని పాఠశాలలో దింపి, ఇంటికి వచ్చి పనులన్నీ చేస్తున్నా, ఇరుగు పొరుగు వారితో సంభాషిస్తున్నా ఆమె మనసంతా ఆ చిట్టి శిశువుపైనే ఉన్నట్టు.. మనం మన వ్యాపకాలను కొనసాగిస్తూనే, చిత్తాన్ని తన ఇష్టదైవముపై ప్రసరింపజేస్తుండాలి.
జై శ్రీమన్నారాయణ