YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దుందుభీ ఇసుక నదిపై అక్రమార్కుల కన్ను

దుందుభీ ఇసుక నదిపై అక్రమార్కుల కన్ను

దుందుభీ ఇసుక నదిపై అక్రమార్కుల కన్ను
మహబూబ్ నగర్, 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా ప్రవహిస్తున్న దుందుభీ నదిలోని ఇసుకపై అక్రమార్కుల కన్ను పడింది. అత్యంత పొడువుగా విస్తరించి ఉన్న దుందుభి నదిలో భారీగా ఇసుక మేటలు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణం రంగం ఊపందుకున్న క్రమంలో ఇసుకకు భారీ డిమాండ్‌ ఉండడంతో అధికారుల సహకారంతో అనుమతుల పేరిట దోచే స్తున్నారు.ప్రభుత్వ అనుమతుల పేరిట కొందరు అక్రమార్కులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మిషన్‌ భగీరథ, రోడ్డుబ్రిడ్జి పనులు, సీసీ రోడ్లు తదితర పేర్లతో అనుమతులు పొంది ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. అలాగే ఉదయం 8గంటలకు ఇసుక తవ్వకాలు ప్రారంభించాల్సి ఉండగా 6గంటలకు ముందే తవ్వకాలు ప్రారంభిస్తున్నారు. అలాగే సాయంత్రం 5గంటలకు ముగించాల్సి ఉన్నా రాత్రి పొద్దుపోయే దాకా ఫ్లడ్‌లైట్లు బిగించి మరీ ఇసుక తరలింపు సాగిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అనుమతులు పొందిన వాహనాలకు జీపీఎస్‌ విధానం లేకపోవడంతో అక్రమార్కుల పంట పండుతోంది. ఒక లారీ ఇసుకను పక్కదారి పట్టిస్తే దాదాపు రూ.30వేల వరకు మిగులుబాటు ఉంటుంది. దీంతో నిత్యం పదుల సంఖ్యలో వాహనాలను దారి మళ్లించి సొమ్ముచేసుకుంటున్నారు.మిషన్‌ భగీరథ, సీసీ రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరుతో ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. అలా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల మీదుగా దాదాపు 150 కి.మీ మేర ప్రవహించే దుందుభీలో ఇసుకను స్వాహా చేస్తున్నారు. అక్రమార్కులకు అధికారుల అండదండలు తోడవడంతో దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది.  కృష్ణా నదికి ఉపనది అయిన దుందుభీ నది ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు జీవాధారం. దాదాపు 150 కి.మీ పైగా ప్రవహిస్తూ పది మండలాలకు సాగు, తాగునీరు అందిస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బాలానగర్‌తో మొదలుకొని రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్, తిమ్మాజిపేట, తాడూర్, కల్వకుర్తి, తెలకపల్లి, వంగూరు, ఉప్పునుంతల మండలాల మీదుగా ప్రవహించి నల్లగొండ జిల్లాలోని డిండిలో కలుస్తుంది.దుందుభీ నది ఒక్కసారి ప్రవహించిందంటే దాదాపు నాలుగేళ్ల వరకు కరువు ఉండదనేది ఇక్కడి రైతుల నమ్మకం. అయితే ఆ నమ్మకం కాస్తా సడలిపోతుంది. నదిలో మేట వేసిన ఇసుకను కొన్ని చోట్ల తోడేస్తుండడంతో భూగర్భజలాలు గతంలో మాదిరిగా ఇంకడం లేదు. ఫలితంగా నది ప్రవహించినా అంతగా ఉపయోగం లేకుండా పోతుంది. గతేడాది దాదాపు 15రోజుల పాటు దుందుభీ ప్రవహించినా... జడ్చర్ల మండల పరిధిలోని కోడుగల్, లింగంపేట, ఆల్వాన్‌పల్లి తదితర గ్రామాల్లో గత వేసవిలో బోర్లు ఎండిపోయాయి.  దుందుభీ పరివాహక ప్రాంతాల్లో గత పదిహేను రోజుల నుంచి అక్రమార్కులు ఇసుక లూటీ చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లోని బాలానగర్‌ మండలంతో పాటు నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని వంగూరు, ఉప్పునుంతల మండలాల నుంచి భారీగా ఇసుకను తరలిస్తున్నారు. స్థానిక అవసరాలు, ప్రభుత్వ పనులైన మిషన్‌ భగీరథ, సీసీ రోడ్లు పేరిట ట్రాక్టర్లతో ఇసుకను విచ్చలవిడిగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉప్పునుంతల, వంగూరు మండలాల సరిహద్దులో ఉన్న తిర్మలాపూర్‌-చింతపల్లి బ్రిడ్జి దిగువన గతంలో ఒడ్డుకు తరిమిన ఇసుకను గోతులు పెట్టి ట్రాక్టర్లకు నింపుతున్నారు. ప్రతీరోజు ఇక్కడ ఒకే చోట నుంచి దాదాపుగా 30 ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం.

Related Posts