నల్లమలలో విషపు నీరు...
నల్గొండ,
నల్లమల అటవీ ప్రాంతంలోని నంబాపూర్ పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం మోతాదు సాధారణ స్థాయికి మించి ఉందని, అది ప్రమాదకరమని పేర్కొంటూ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్(ఏఎండీ) సైంటిస్టులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. నల్గొండ జిల్లాలో పరిధిలో యురేనియం నిల్వలు ఉన్న ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు విషంతో సమానమని, నంబాపూర్‌తోపాటు చుట్టూ ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలను అక్కడి నుంచి తరలించాలని అందులో సూచించినట్టు సమాచారం. అయితే ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్న ప్రచారమని, స్థానికులను భయపెట్టి, వెళ్లగొట్టే ప్రయత్నమని పర్యావరణవేత్తలు అంటున్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమిస్తున్న సమయంలో కావాలనే ఇలాంటివి లీక్ చేస్తున్నారని పేర్కొంటున్నారు.నల్గొండ జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో భారీగా యురేనియం నిల్వలు ఉన్నట్టు చాలా ఏళ్ల కిందటే అధికారులు గుర్తించారు. పెద్దగట్టు రీజియన్‌లోని నంబాపూర్ పరిసర ప్రాంతాల్లో యురేనియం నిల్వలు ఏ మేరకు ఉన్నాయన్న దానిపై పరిశోధన చేపట్టారు. 2013 జూన్‌లో హైదరాబాద్‌లోని జేఎన్టీయూకు చెందిన సైంటిస్టుల బృందం నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, సేరిపల్లి ప్రాంతాల్లో యురేనియం సాంద్రతపై లేజర్ ఫ్లోరిమెట్రీ పద్ధతిలో పరిశోధించింది. భూగర్భ జలాల్లో యురేనియం స్థాయి 0.6 నుంచి 521.15 పీపీబీ (పార్ట్స్ పర్ బిలియన్) వరకు ఉన్నట్టు గుర్తించింది. ఆ పరిశోధన వివరాలను అప్పట్లోనే ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. తాజాగా ఏఎండీ సైంటిస్టులు గతేడాది జులై నుంచి ఈ ఏడాది జులై వరకు నంబాపూర్, పెద్దగట్టు దాని పరిసర ప్రాంతాల్లో మరోసారి పరిశోధనలు చేశారు. 25 బోర్లు వేసి గ్రౌండ్ వాటర్ శాంపిళ్లను పరిశీలించారు. కొన్ని బోర్లలోని నీటిలో ఏకంగా 2,618 పీపీబీ యురేనియం ఆనవాళ్లు ఉన్నట్టుగా గుర్తించారని తెలిసింది. ప్రమాణాల ప్రకారం భూగర్భ జలాల్లో యురేనియం మోతాదు 30 పీపీబీ వరకు ఉంటే ప్రమాదకరం కాదని, కేవలం నాలుగు బోర్లలోనే ఈ మోతాదు ఉందని, 14 బోర్లలో ప్రమాదకర స్థాయిలో, ఏడు బోర్లలో తీవ్ర ప్రమాదకర స్థాయిలో యురేనియం మోతాదు ఉందని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. యురేనియం నిక్షేపాలు గ్రౌండ్ లెవల్‌కు సమీపంలో ఉండటం కూడా ఆందోళన కలిగించే విషయమని, వెంటనే స్థానికంగా ఉన్న 30 వేల మంది ప్రజలను తరలించాలని సూచించినట్టు తెలిసింది.భూగర్భ జలాల్లో యురేనియం మోతాదు ఎక్కువగా ఉందన్న ఏఎండీ పరిశోధన వాస్తవమే అయితే.. కోట్ల మంది తాగునీటి అవసరాలు తీరుస్తున్న కృష్ణా నది కలుషితమయ్యే అవకాశముందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదీ జలాలు కలుషితం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, యురేనియం అన్వేషణ ప్రక్రియను ఎక్కడికక్కడే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. బోర్ల తవ్వకాల వల్ల యురేనియం బయటి వాతావరణంలోకి, నదీ జలాల్లోకి చేరే అవకాశముందని పేర్కొన్నారు.