ప్రయాణికుల నుండి టికెట్ ధర కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు
- నాగర్ కర్నూల్ డిపో నోడల్ అధికారి అఖిలేష్ రెడ్డి
నాగర్ కర్నూలు
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సరిపడా బస్సులు నడుపుతున్నామని నాగర్ కర్నూల్ డిపో నోడల్ అధికారి అఖిలేష్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల జేఏసీ సమ్మెలోకి దిగడం వల్ల ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా రవాణా ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం నాగర్ కర్నూలు ఆర్టీసీ బస్స్టాండ్ను పోలీస్ మరియు ఆర్టీసీ అధికారులతో కలిసి సందర్శించి ప్రయాణికులకు ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల బస్సులను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన డ్రైవ ర్లను, డిపో మేనేజర్, ఎంవీఐల ఆధ్వర్యంలో డ్రైవర్ల చోదక నైపుణ్యాలను పరిశీ లించి 195 మంది డ్రైవర్లను తాత్కాలికంగా విధుల్లోకి తీసుకున్నామని తెలిపా రు. అలాగే 195 మంది కండక్టర్లను తాత్కాలికంగా తీసుకొని ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 79 విద్యా సంస్థల బస్సులు, 17 కాంట్రాక్ట్ క్యారియర్ సీసీ బస్సులను, 120 ప్రైవేట్ క్యాబ్ లు నడుపుచున్నాట్టు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఈ శ్రీధర్ ఆదేశాలతో జిల్లాలోని నాలుగు డిపోలకు ఒక్కొక్క డిపోకు నోడల్ ఆఫీసర్ నియమించినట్లు నాగర్ కర్నూల్ డిపోకు అఖిలేష్ రెడ్డి, కొల్లాపూర్ డిపో కు ఆర్డిఓ హనుమానాయక్ అచంపేట్ డిపోకు ఆర్డిఓ పాండు నాయక్ కల్వకుర్తి డిపోకు ఆర్డిఓ రాజేష్ కుమార్ లను నియమించినట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ టికెట్ ధరలు మాత్రమే చెల్లించాలని అదనంగా వసూలు చేస్తే సంబంధిత డిపో అధికారులకు ఫిర్యాదు చేయాలని, ఆయన సూచించారు. ఆర్టీవో ఎర్రిస్వామి డిఎస్పి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.