YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడోస్సారి ప్రయత్నాలు

మూడోస్సారి ప్రయత్నాలు

మూడోస్సారి ప్రయత్నాలు
విజయవాడ, 
ఆ చాప్టర్ ముగిసింది. కమలం తో కయ్యానికి పోయి రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలింది తెలుగుదేశం. కేంద్రం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తే తప్ప రాష్ట్రప్రభుత్వంపై పోరాటం చేసే సత్తువ కూడా కోల్పోయింది. ఈ స్థితిలో బీజేపీ అధినాయకత్వంతో పూర్తిస్థాయి సంబంధాల పునరుద్ధరణపై దృష్టిసారిస్తున్నారు చంద్రబాబు నాయుడు. బహిరంగంగానే తప్పు చేశామని అంగీకరిస్తున్నారు. పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు మోడీ పైన, బీజేపీపైన విరుచుకు పడిన క్యాడర్ మళ్లీ కమలం పార్టీని కీర్తించాల్సిన అవసరం ఉందని నూరిపోస్తున్నారు చంద్రాబాబు. ఈ ప్రయత్నం ఎంతవరకూ పనిచేస్తుందనే అంశాన్ని పక్కన పెడితే నేరుగా అధినేత చంద్రబాబు చెబుతున్న మాటలు అవకాశవాదమేనంటున్నాయి పార్టీ వర్గాలు అంతర్గతంగా. చంద్రబాబు మాత్రం పునరుత్తేజం పొందడానికి మూడోసారీ కమలంతో కలవడం తప్పని సరి అవసరమనే భావనలో ఉన్నారు.నాలుగు నెలల కాలంలోనే చంద్రబాబు స్వరం పూర్తిగా యూ టర్న్ తీసుకుంది. రాజకీయమంటే అవసరాలకు అనుగుణంగా అభిప్రాయాలు మార్చుకోవడమనే కళను చంద్రబాబు పూర్తిగా వంటబట్టించుకున్నారు. ఏఐఏడీఎంకే వంటి మిత్రులతో పోలిస్తే తెలుగుదేశాన్ని విశ్వసనీయ మిత్రపక్షంగా తొలిదశలో బీజేపీ నమ్ముతుండేది. 1998 నుంచి 2004 వరకూ టీడీపీ బీజేపీని బలపరిచింది. రెండు పార్టీలకూ దీనివల్ల ప్రయోజనం సమకూరింది. కార్గిల్ యుద్ధం వంటి సందర్బాల్లో బీజేపీకి లభించిన అడ్వాంటేజ్ ను ఆ పార్టీతో జట్టుకట్టడం ద్వారా టీడీపీ సైతం తనకు అనుకూలంగా మలచుకోగలిగింది. 2004లో బీజేపీ కారణంగా పెద్దగా ప్రయోజనం లభించలేదు. వెంటనే చంద్రబాబు స్టాండ్ మార్చుకున్నారు. 2009 నాటికి వామపక్షాలు, టీఆర్ఎస్ తో చేయి కలిపారు. రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెసుకు బలమైన పోటీ ఇచ్చినప్పటికీ విజయం సాధించలేకపోయారు. మళ్లీ 2014 వచ్చేసరికి కమలం పార్టీని చంద్రబాబు ఆశ్రయించారు. ఫలితం సాధించారు. 2019 కి మళ్లీ కొత్త పంథాను అనుసరించారు. వైసీపీ అధినేతపై కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యల విషయంలో బీజేపీ దూకుడు కనబరచకపోవడంతో చంద్రబాబు తీవ్రంగా అసంతృప్తికి లోనయ్యారు. బీజేపీని, వైసీపీని ఒకే గాటన కట్టి ప్రత్యేక హోదా సెంటిమెంటు రగిలించడం ద్వారా మరోసారి రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగరవేయాలనుకున్నారు చంద్రబాబు. ఆ ప్రయత్నమూ విఫలమైంది. ఘోరపరాజయం తర్వాత తాజాగా వాస్తవాలను ఒక్కటొక్కటిగా గ్రహిస్తున్నారు. వాటిని మళ్లీ దిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు.ఒక పార్టీ అధినేత తాను తప్పు చేశానని ఒప్పుకోవడం చిన్న విషయం కాదు. కేంద్రంతో విభేదించి టీడీపీ నష్టపోయింది. రాష్ట్రానికి ఒరిగిందీ లేదు. విశాఖపట్నంలో కార్యకర్తలతో చంద్రబాబు తేల్చి చెప్పిన విషయం ఇది. దీంట్లో రెండు ప్రయోజనాలను ఆయన ఆశిస్తున్నారు. బీజేపీతో కలిసి నడవాల్సిన అవసరాన్ని కార్యకర్తలకు ఉద్బోధిస్తున్నారు. అదే సమయంలో పార్టీని వీడి వెళ్లిపోతున్న నాయకులను కొంతమేరకు నియంత్రించాలనే భావన కూడా దాగి ఉంది. భవిష్యత్తులో బీజేపీతో టీడీపీ కలుస్తుందనే సంకేతాల ద్వారా వేచి చూసే ధోరణిలో వలసలకు అడ్డుకట్ట పడుతుందనే ఆశ చంద్రబాబులో తొంగి చూస్తోంది. అధికారం లేకపోవడంతో ఆర్థికంగానూ తెలుగుదేశం నాయకులు సొంత వనరులు వెచ్చించేందుకు ఇష్టపడటం లేదు. పార్టీ కార్యక్రమాలు పడకేశాయి. నిరసనలు, ఆందోళనలకు పిలుపునిచ్చినా మొక్కుబడిగానే స్పందిస్తున్నాయి శ్రేణులు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని బీజేపీతో ఎంత తొందరగా కలిస్తే అంతగానూ పార్టీకి మంచిదనే అభిప్రాయానికి అధినేత చంద్రబాబు వచ్చేశారు. అవసరమైతే ఉమ్మడి కార్యాచరణతో ఆందోళనలు చేపట్టాలనే యోచనలో ఉన్నారు. అయితే బీజేపీ వైపు నుంచే ఇంకా పెద్దగా సానుకూలత కనిపించడం లేదు.భారతీయ జనతాపార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇంకా స్పష్టమైన వైఖరికి రాలేదు. పార్టీ ఎదగాలంటే టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ స్థానాన్ని ఆక్రమించాలని కొందరు నాయకులు సూచిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న బలం దృష్ట్యా దాని సహకారంతోనే బీజేపీ ఎదగడం సులభమని మరికొందరు నాయకులు చెబుతున్నారు. గతంలో 1999, 2014 రెండు సందర్బాల్లోనూ బీజేపీ ఎదుగుదలకు పొత్తు రూపంలో టీడీపీ గండి కొట్టిందనేది మెజార్టీ నాయకుల భావన. పార్టీ పట్ల కొంత సానుకూలత వస్తున్న దశలో మళ్లీ సైకిల్ పార్టీతో చేయి కలిపితే దానిని చంద్రబాబు నాయుడు అడ్వాంటేజ్ గా తీసుకుని సొంతపార్టీని బలోపేతం చేసుకుంటారు. బీజేపీ మళ్లీ తోకపార్టీగా మిగిలిపోవాల్సి వస్తుందని బీజేపీ అగ్రనాయకత్వంలోనే కొందరి అభిప్రాయం.టీడీపీపై వైసీపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పూనుకుంటోంది. ఈ విషయమై బీజేపీ, కేంద్రం చూసీచూడనట్లు మౌనం వహిస్తే ప్రతిపక్షం పూర్తిగా దెబ్బతింటుంది. అప్పుడు ఆ స్థానాన్ని కమలం ఆక్రమించడం సులభమని రాజకీయంగా టీడీపీతో విభేదించే బీజేపీ నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడిని పూర్తిగా విశ్వసించే పరిస్థితి మోడీ, అమిత్ షాల కు లేదు. అలాగని వైసీపీ అజెండాను చూస్తూ ఊరుకునే ప్రసక్తీ లేదు. గతంలో బీజేపీ బలాన్ని కూడా వాడుకుంటూ టీడీపీ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. ఈసారి అదే ఎత్తుగడతో టీడీపీ బలాన్ని బీజేపీ వినియోగించుకుంటే సరిపోతుందని కొందరు రాజకీయవేత్తలు పేర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ కమలం పార్టీ షరతుల మేరకే , మోడీ, అమిత్ షాల కనుసన్నల్లో నడిచేందుకు చంద్రబాబు ఇష్టపడితేనే టీడీపీతో పొత్తు కు అవకాశం ఉంటుంది. టిట్ ఫర్ టాట్ అంటూ టీడీపీకి బదులిస్తూనే వైసీపీకి చెక్ చెప్పే వ్యూహంలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది

Related Posts