YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరు జిల్లాపై చంద్రబాబు దృష్టి

నెల్లూరు జిల్లాపై చంద్రబాబు దృష్టి

నెల్లూరు జిల్లాపై చంద్రబాబు దృష్టి
నెల్లూరు, 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటనలతో జోరు పెంచారు. ఇప్పటికే తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల సమీక్షలను చేసిన చంద్రబాబు తాజాగా నెల్లూరు జిల్లా సమీక్షలు చేశారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పడకేసింది. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. గొప్ప గొప్ప నేతలనుకున్న సైకిల్ పార్టీ లీడర్లు పరాజయం బాట పట్టారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోకపోవడాన్ని చంద్రబాబు సీరియస్ గానే తీసుకున్నారు.నెల్లూరు జిల్లాలో ఇప్పుడే కాదు తొలి నుంచి తెలుగుదేశంపార్టీ బలహీనంగానే ఉంది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మూడు స్థానాలను మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. దీంతో గత ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ స్థానాలను గెలుచుకోలేకపోయినా ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలను ఎమ్మెల్సీ చేసి మరీ మంత్రి పదవులు ఇచ్చారు.తీరా ఎన్నికల ఫలితాలను చూస్తే ఇక్కడ జీరో రిజల్ట్ రావడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. రాష్ట్రమంతటా అదే పరిస్థితి ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లా పార్టీని దెబ్బతీయడానికి కారణాలను చంద్రబాబు విశ్లేషించారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రూపు తగాదాలతోనే పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని భావిస్తున్నారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడానికి కారణాలను సయితం ఆయన ఇప్పటికే నివేదిక రూపంలో తెప్పించుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలు పార్టీని భ్రష్టు పట్టించాయని అనేక మంది నేతలు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల పాటు చంద్రబాబు నెల్లూరులోనే ఉంటారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు బస కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంట్లోనే కావడం విశేషం. దీన్ని కూడా కొందరు నేతలు తప్పుపడుతున్నారు. పార్టీకి ఇంత ఘోరమైన ఓటమికి కారకుడైన సోమిరెడ్డి ఇంట్లో బస చేస్తే ఎలాంటి సంకేతాలు వెళతాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కొందరు నేతలు దీనిపై బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు అధికార పార్టీకి భయపడి బయటకు రావడం లేదు. మరి చంద్రబాబు రాకతోనైనా తెలుగు తమ్ముళ్లు వేగం పెంచుతారో? లేదో? చూడాలి.

Related Posts