రైతుపై ఈగ పగ (చిత్తూరు)
చిత్తూరు, :టమోటా రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.. వర్షాల నుంచి టమోటా తోటలను కాపాడుకున్నామన్న అన్నదాతల ఆశలు ఎంత కాలమో నిలువ లేదు.. ఊజి ఈగలు తోటలపై దాడులకు పాల్పడుతున్నాయి.. తోటలు పూతదశకు చేరేటప్పటికే ఊజి ఈగలు టమోటా తోటల్లో దూరేస్తున్నాయి.. పిందెలపై గుడ్లు పెట్టేస్తున్నాయి.. పిందె పెద్దదై కాయ పక్వదశకు చేరితే ఈగ గుడ్లు పెట్టిన చోట పుండులా ఏర్పడుతోంది.. కాయలో నుంచి పురుగులు తయారై పొరకు రంధ్రం పెట్టుకుని బయటకు వస్తున్నాయి.. కాయ నుంచి నీరు కారుతూ మార్కెట్‌కు పనికి రాకుండా పోతున్నాయి..దీనికి తోడు ఊజి ఈగలు కుట్టిన కాయలు ముందుగానే తోటల్లో మొక్కల నుంచి కిందికి రాలిపోతున్నాయి. మదనపల్లె డివిజన్ టమోటా సాగునకు పెట్టింది పేరు. 2019 ఆగస్టులో మదనపల్లె, రామసముద్రం, నిమ్మనపల్లె, పుంగనూరు, చౌడేపల్లె, పెద్దపంజాణి, పలమనేరు, కుప్పం, శాంతిపురం, కురబలకోట తదితర మండలాల పరిధిలో సుమారుగా 10 వేల హెక్టార్లకు పైగానే టమోటా సాగు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న చలి వాతావరణానికి ఊజి ఈగలు టమోటా తోటలపై దాడికి పాల్పడ్డాయి. పిందె దశలోనే పిందెలపై గుడ్లు పెట్టేశాయి. కాయ పెద్దదై పక్వదశకు చేరేటప్పటికే కాయలో పురుగులు ఏర్పడ్డాయి. కాయకు రంధ్రాలు పెట్టి బయటకు వస్తున్నాయి. మొక్క నుంచి కాయ తొడిమ పట్టు కోల్పోయి కిందికి రాలిపోతోంది.
కాయలు మార్కెట్‌కు పనికి రాకుండా పోతున్నాయి. ఊజి ఈగను నియంత్రించేందుకు ప్రస్తుతం రైతులు మందులు పిచికారి చేస్తున్నారు. తోటల నుంచి కాయలు కోసి వాటిని వేరుచేస్తే సగం కాయలు మార్కెట్‌కు పనికి రాకుండా పోతున్నాయి. కాయలను పారబోయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా సగానికి సగం దిగుబడులను రైతులు నష్టపోయే దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి రామసముద్రం, పుంగనూరు, మదనపల్లె, చౌడేపల్లె, పెద్దపంజాణి మండలాల్లో అధికంగా ఉన్నట్లు అంచనా. దీనికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కాయలకు గజ్జి ఏర్పడుతోంది. గజ్జి పట్టిన కాయలు కూడా మార్కెట్‌కు పనికి రాకుండా పోతున్నాయి. డివిజన్ పరిధిలో ఊజిఈగల దాడి, గజ్జి తెగుళ్ల కారణంగా సుమారుగా రూ.20 కోట్లకు పైగానే టమోటా రైతులు నష్టపోయినట్లు అంచనా.