YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముంచేస్తారా..? (నెల్లూరు)

ముంచేస్తారా..? (నెల్లూరు)

ముంచేస్తారా..? (నెల్లూరు)
నెల్లూరు,  పాలకుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల నిర్లిప్తత.. కారణాలు ఏవైనా జిల్లాలోని కీలక జలాశయానికి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. పిచ్చిమొక్కలతో నిండిన కట్ట, తుప్పు పట్టిన గేట్లకు తోడు భారీగా దెబ్బతిన్న రివిట్‌మెంట్‌తో ప్రమాదకర స్థితి ఏర్పడింది. పలుచోట్ల కుంగిపోయి కనిపిస్తోన్న కట్టతో ప్రమాదం పొంచి ఉంది. ఏ క్షణాన నిండా నీరు చేరినా పటిష్ఠత  ప్రశ్నార్థకమే. ఫలితంగా వేలాది ఎకరాల ఆయకట్టుకు భరోసా కల్పించలేని దుస్థితి ఏర్పడింది. వందేళ్ల నాటి కనిగిరి జలాశయం ఆధునికీకరణ పనులు ఇప్పటికీ చేపట్టకపోవడం, అరకొరగా చేసిన పనుల్లోనూ ఆదాయమే పరమావధిగా కథ నడిపించడంతో ఈ పరిస్థితి నెలకొంది. బ్రిటీషు హయాంలో సుమారు వందేళ్ల క్రితం బుచ్చిరెడ్డిపాళెం మండలంలో కనిగిరి జలాశయాన్ని నిర్మించారు. ఆత్మకూరు, కోవూరు, కావలి నియోజకవర్గాల్లోని 8 మండలాలకు లబ్ధి చేకూరాలన్నది లక్ష్యం. ఈ జలాశయంలోకి సోమశిల, పెన్నా మీదుగా ప్రత్యేక కాల్వలున్నాయి. మొత్తం 3.44 టీఎంసీల నిల్వసామర్థ్యం ఉన్న దీని కింద 1.75 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అనధికారికంగా మరో 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇంతటి కీలకమైన జలాశయం ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో కనిపిస్తుండటం గమనార్హం. ఇలా ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడం ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం కనిగిరి జలాశయం గేట్లు తుప్పు పట్టిపోగా.. అవి కదలడమూ కష్టంగా మారింది. కరకట్ట మొత్తం ముళ్లపొదలతో నిండిపోగా.. వెలుపల ఆక్రమణలు ఎక్కువయ్యాయి. గేట్లకు సమీపంలో రివిట్‌మెంట్‌ భారీగా దెబ్బతింది. రక్షణ గోడలు పగిలిపోగా.. పలుచోట్ల కట్ట కుంగిపోయింది. జలాశయం ఈస్ట్రన్‌, సదరన్‌ ఛానళ్లు మరింత దారుణంగా ఉన్నాయి. గోడలు పగుళ్లివ్వగా.. గేట్ల వద్ద లీకేజీలు ఎక్కువయ్యాయి. ఈస్ట్రన్‌ ఛానల్‌కు మరమ్మతులు చేసినా ఫలితం లేకపోయింది. మొత్తంగా ఈ జలాశయాన్ని వెంటనే ఆధునికీకరించాలని గతంలో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం లేదు. రెండేళ్లుగా ఈ జలాశయానికి నీటి ప్రవాహం లేదు. దీంతో ఎండిపోయి దర్శనమిచ్చింది. ఆ సమయంలో నిధులు మంజూరు చేసి ఉంటే ఆధునికీకరణ ప్రక్రియ పూర్తయి ఉండేది. అదే జరిగి ఉంటే ప్రస్తుతం సోమశిల నుంచి ఈ జలాశయానికి, దిగువ చెరువులకు అధికారులు నీరు మళ్లించిన క్రమంలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. ఆ పరిస్థితి లేక ఆయకట్టుకు ఈ జలాశయం ఉపయోగపడని విధంగా తయారైంది.
కనిగిరి జలాశయం ప్రమాదకరస్థితిలో ఉందని ఏడాదిన్నర క్రితం అధికారులు అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వెంటనే నిధులు మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని అన్నారు. రూ..15.80 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఇందులో కట్ట ఆధునికీకరణ కోసం రూ.5.85 కోట్లు అవసరమని పేర్కొన్నారు. అలాగే రూ.కోటి సదరన్‌ ఛానల్‌ రెగ్యులేటర్‌, ఎస్‌ఎల్‌బీ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం రాశారు. ఇక రూ.కోటి ఈస్ట్రన్‌ ఛానల్‌ మరమ్మతులకు అవసరమని స్పష్టం చేశారు. వీటితోపాటు పైడేరు ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ కోసం రూ.3.85 కోట్లు కావాలని ప్రస్తావించారు. అప్పట్లో ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై చొరవ చూపకపోవడంతో ముందుకు కదలలేదు. ప్రస్తుత రాష్ట్రప్రభుత్వం ఈ జలాశయంపై దృష్టి పెట్టింది. ఆధునికీకరించే దిశగా అడుగులు వేస్తోంది. ఆమేరకు స్థానిక ఎమ్మెల్యే, జలవనరులశాఖ మంత్రి చొరవ చూపిస్తున్నారు. ఆధునికీకరణకు వివరాలను ప్రతిపాదించాలని సూచించినట్లు సమాచారం. అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పెరిగిన ధరల ప్రకారం రూ.20 కోట్లతో అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో కనిగిరి జలాశయానికి మహర్దశ పట్టినట్లే.

Related Posts