Highlights
- 2,834 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
- పరీక్షలకు 6,17,484 మంది విద్యార్థులు
- ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి గంటా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ నెల 29 వరకు జరగనున్నఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. మొత్తం 6,17,484 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. తమ హాల్ టికెట్లు చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144ను అమలు చేశారు. అంతే కాకుండా పరీక్షల నిర్వహణకు 156 తనిఖీ బృందాలు, ఫ్లయింగ్ స్వ్కాడ్ లపై పర్యవేక్షణ, ప్రతి జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. నగరాల్లో విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు సెంటర్ లొకేషన్ యాప్ ను రూపొందిచామని, ఈ యాప్ ను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నెం. 18005994550 లో సంప్రదించాలని కోరారు.
పదోతరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలతో పాటుగా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని మంత్రి గంటా శ్రీనివాస రావు హెచ్చరించారు.ఏ విద్యార్థి నేలపై కూర్చొని పరీక్ష రాయడానికి వీల్లేదని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలోని వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని గదుల్లోని ఫ్లోరింగ్ సరిగ్గా లేకపోవడంతో దానిని బాగు చేయించాలని ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా స్వేచ్ఛగా పరీక్షలు రాయాలని, వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి గంటా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు గంటా శ్రీనివాసరావు ఆల్ ది బెస్ట్ చెప్పారు.