YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

*అట్లతద్దె*

*అట్లతద్దె*

*అట్లతద్దె*
అట్లతద్దె....... అట్ల తద్ది ఆరు అట్లోయ్ , ముద్ద పప్పు మూడు అట్లోయ్...... అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు
ఆశ్వీయుజ బహుళ తదియనాడు వచ్చే అట్లతద్దె పండుగ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఉపవాసముండాలి. ఇంట్లో తూర్పుదిక్కున మంటపము ఏర్పాటుచేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, స్లోకాలు, పాటలు చదవడం, పాడడం చేయాలి.సాయంత్రం చంద్రదర్శనానికి తర్వాత తిరిగి స్నానం చేసి మళ్లీ గౌరీపూజచేసి, 10 అట్లు నైవేద్యముగాపెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 10 అట్లు, 10 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్దెనోము కథను చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి.ప్రాంతపు ఆనవాయితీ పట్టి 11 అట్లుకూడా ఇస్తారు.ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక వస్త్రములు, దక్షినతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈ పండుగలో విశేషము.ఈ పండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లికాని అమ్మాయిలకు గుణవంతుడైన భర్త లభిస్తాడని, పెళ్ళైనవారికి పిల్లకు కలుగుతారని, ఐదోతనముతోపాటు, పుణ్యము లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న విశ్వాసం .కాగా.. అట్ల తద్దె లేదా అట్ల తదియగా పిలువబడే ఈ పండుగ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. "అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగువారికి వాయినాలివ్వటం పరిపాటి. ఆ రోజు సాయంత్రం వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదిలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.ఇదిలా ఉంటే.. త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్భలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్దె అని పురాణాలు చెబుతున్నాయి. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే ఈ వ్రతంలో చంద్రారాధన ప్రధానమైన పూజ. చంద్రకళల్లో కొలువైవున్న ఆ పరాశక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యము పెరుగుతుందని విశ్వాసం.అలాగే ఈ వ్రతాన్ని ఆచరించే మహిళల కుటుంబములో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతర్ధానముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం.ఇంకా రజోదయమునకు కారకుడైన కుజుడు ఋతుచక్రాన్ని సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడని విశ్వాసం. అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు ప్రీతికరమైన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావమురాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు కూడా ఇవి  అట్లతద్దె రోజున ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు.వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి, అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అంతే.
వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు.
”ఇస్తినమ్మ వాయనం”
”పుచ్చుకుంటినమ్మ వాయనం”
”అందించానమ్మా వాయనం”
”అందుకున్నానమ్మా వాయనం”
”ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం”
”ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం”
“అట్లతద్దె” వ్రతమహిమ:
పూర్వం ఒక మహారాజుకు లావణ్యవంతమైన కుమార్తె ఉండేది. ఆమెపేరు కావేరి. కావేరి తన తల్లి ద్వారా అట్లతద్దె వ్రతమహిమను తెలుసుకుని తన రాజ్యమందుగల ఆమె స్నేహితురాళ్లు మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి ఈ చంద్రోదయ ఉమావ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించింది. కాని.. తోటి మంత్రి, సేనాపతి, పురోహితుని కూతుళ్లకు వివాహ వయస్సు రాగానే నవయవ్వనులైన అందమైన భర్తలతో వివాహం జరిగింది.దీంతో మహారాజు అమ్మాయి స్నేహితురాళ్లకు వివాహములు జరిగిపోవుచున్నవని తలచి తన కుమార్తెకు వివాహప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. కానీ కావేరికి యవ్వనులు గాకుండా వృద్ధులైన వారే పెండ్లికుమారులుగా తారసపడసాగిరి.మహారాజు ప్రయత్నములన్నీ విఫలం కావడం చూచిన రాకుమార్తె కావేరి ఎంతో కలతచెంది.. రాజ్యమును వదిలి సమీప అరణ్యములో ఘోర తపస్సు చేసింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కావేరీకి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా..! కావేరి తన అట్లతద్దె వ్రతాచరణ చేసినా ఫలితం దక్కలేదని, నా వ్రతములో ఏదైనా దోషమేమిటని? ప్రశ్నిస్తూ.. దుఃఖించసాగింది.అంతటితో పార్వతీపరమేశ్వరులు ఓ సౌభాగ్యవతి.. ఇందులో నీ దోషము ఏ మాత్రము లేదు. నీవు ఆ అట్లతద్దె నోచే సమయంలో ఉపవాసదీక్షకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోగా, విషయమంతా నీ తల్లిద్వారా తెలుసుకున్న నీ సోదరులు ఒక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దముగుండా నీకు చంద్రునిని చూపించినారు.దానితో నీవు ఉపవాస దీక్షను విరమించినావు. ఆ వ్రత భంగమే ఇదని ఆది దంపతులు వివరించారు. నీ సోదరులకు నీపై గల వాత్సల్యముతో అలా చేశారని, ఇందులో నీవు దుఃఖించవల
సిందేమీ లేదని, రేపువచ్చే ఆశ్వీయుజ బహుళ తదియనాడు విధివిధానంగా వ్రతమాచరించు. నీ మనోభిష్టము తప్పక నెరవేరుతుందని కావేరిని ఆశీర్వదించి అంతర్ధానమైనారు.అలా ఆ రాకుమార్తె తిరిగి శ్రద్ధాభక్తులతో వ్రతమాచరించి మంచి అందమైనవాడు, చక్కని శౌర్యపరాక్రమములు కలిగిన నవయవ్వన రాకుమారునితో వివాహమై నిరంతరము ఉమాశంకరులను సేవిస్తూ సమస్త సుఖభోగములను అనుభవించసాగింది. అందుచేత మనం కూడా అట్లతద్దె రోజున ఉమామహేశ్వరులను నిష్ఠతో పూజించి వారి అనుగ్రహముతో అష్టైశ్వర్యాలను పొందుదుముగాక..!
*ఓం నమః శివాయ*

Related Posts