మెస్ చార్జీల విషయం మరిచిపోయారు
వరంగల్,
పేదరికం కారణంగా ఇంటికి దూరంగా, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకునే స్టూడెంట్స్ కు కనీసం అవసరాలు తీరడం లేదు. కాస్మోటిక్ చార్జీలు సైతం రాక చిన్న చిన్న అవసరాలకు ఇంట్లో వారిని అడగాల్సిన పరిస్థితి. 6 నెలలుగా సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. రావాల్సిన మెస్ చార్జీలను సర్కార్ విడుదల చేయకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ వార్డెన్లకు తలకుమించిన భారంగా మారింది. హాస్టళ్లల్లో చదివే పిల్లల భోజనం, ఇతర సదుపాయాలకు నిధులు లేక ఏం చేయాలో తోచడం లేదు. పేద విద్యార్థులకు అన్నం పెట్టేందుకు ఇచ్చే డైట్ చార్జీలు 7 నెలలుగా అందని పరిస్థితి జిల్లాలో నెలకొంది. బిల్లులు చెల్లించాలని ప్రతిరోజు అధికారుల చుట్టూ తిరుగున్నామని కొందరు వార్డెన్లు వాపోయారు. పిల్లల కష్టాలు చూడలేక తమ సొంత పైసలు ఖర్చు చేస్తున్నామని అవి ఏ మూలకూ సరిపోవడం లేదంటున్నారు. బిల్లులు ఇవ్వకపోతే హాస్టళ్లను నడపలేమని చేతులెత్తేసే పరిస్థితి ఉందన్నారు. హాస్టళ్లకు సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో పంపిణీ చేయలేమని హెచ్చరిస్తున్నారు.జిల్లాలో ఎస్సీ సంక్షేమ హాస్టళ్లు 37ఉన్నాయి. ఇందులో పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, ప్రీ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. బీసీ సంక్షేమ హాస్టళ్లను కలుపుకుంటే ఈ సంఖ్య రెట్టింపవుతుంది. వీటిల్లో సుమారు 5,700 మంది వసతి పొందుతున్నారు. వీరిలో స్కూల్ స్థాయి నుంచి ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ఉన్నారు. పోస్ట్ మెట్రిక్ చదివే వారికి డైట్చార్జీలుగా రూ.1500, ప్రీ మెట్రిక్ స్టూడెంట్స్ కు క్లాస్‍ను బట్టి రూ.750 నుంచి రూ.1100 వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. హాస్టళ్లకు ప్రభుత్వమే బియ్యం, చింతపండు, పప్పులు సరఫరా చేస్తున్నా కూరగాయలు, గుడ్లు, చికెన్, ఇతర వస్తువులను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. వీటికి సంబంధించిన బిల్లులు పెండింగ్‍లో ఉన్నాయి. దీంతో కొన్ని వస్తువులను కాంట్రాక్టర్లు సరఫరా చేయడం లేదని పలువురు వార్డెన్లు తెలిపారు. పోస్ట్/ప్రీ మెట్రిక్ హాస్టళ్లకు ఈ ఏడాది మార్చి నుంచి నిధులు విడుదలు విడుదలవ్వడం లేదని సమాచారం.ఆలస్యమైనా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది కదా అని వార్డెన్లు స్థోమత లేకున్నా బయట అప్పులు చేసిమరీ విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. గుడ్లు, పాలు, చికెన్, కూరగాయల వ్యాపారులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లిస్తే కానీ సరుకులు ఇవ్వలేమని చెబుతున్నారు. దీంతో మరోచోట అప్పులు చేసి పాత అప్పులు తీర్చి మళ్లీ అప్పు చేసి సరుకులు, కూరగాయలు కొంటున్నారు. పాఠశాల స్థాయి పేద విద్యార్థులకు నెలనెలా కాస్మోటిక్, హెయిర్ కటింగ్, నాప్‌కిన్ చార్జీలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అబ్బాయిలకు నెలకు కాస్మోటిక్ చార్జీల కింద రూ.50, కటింగ్ చార్జీల కింద రూ.12 ఇలా మొత్తంగా రూ.62 ఇవ్వాలి. ప్రైమరీ స్థాయి బాలికలకు కాస్మోటిక్ చార్జీలు రూ.55, హైస్కూల్ విద్యార్థినులకు నాప్‌కిన్ చార్జీలతో కలిపి రూ.75 ఇవ్వాలి. కానీ ప్రభుత్వం విడుదల చేయలేదు. కటింగ్ చార్జీలు, సబ్బులు, నూనెలకు వార్డెన్లు వారి జేబుల నుంచి చెల్లింపులు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎస్సీ సంక్షేమ డీడీ రామారావు దృష్టికి తీసుకెళ్లగా 6 నెలలుగా మెస్చార్జీలు, కాస్మోటిక్ చార్జీలకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదని త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు.