రాజధానిలో 100 శాతం బస్సులు నడపండి
- మంత్రి పువ్వాడ
హైదరాబాద్
హైదరాబాద్ లో వంద శాతం బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశించారు. ఆర్టీసీ డీఎంలు, డీవీఎంలు, రీజినల్ మేనేజర్లతో బుధవారం ఆయన రవాణా శాఖ ప్రధాన కార్యాలయం నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానుండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి ఈ సందర్భంగా సూచించారు. కాగా జిల్లాల్లో వంద శాతం బస్సులు నడుపుతున్నామని, హైదరాబాద్ నగరంలో మాత్రం 40 శాతం బస్సులు మాత్రమే నడుస్తున్నాయని మంత్రికి ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. హైదరాబాద్ సిటీ లో బస్సులను 100శాతం నదిపేల చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి పువ్వాడ ఆదేశించారు. అనుభవజ్ఞుల కొరత... కాగా నగరంలో పూర్తి స్థాయిలో బస్సులను తిప్పాలని ఆర్టీసీ అధికారులు యత్నిస్తున్నప్పటికీ... అందుకు అనుభవజ్ఞులైన డ్రైవర్ల కొరత ఆర్టీసీకి సమస్యగా మారింది. మరోవైపు... నగరంలో సాధారణంగా ఉండే భారీ ట్రాఫిక్ నేపధ్యంలో బస్సులను నడిపేందుకు ప్రైవేటు డ్రైవర్లు వెనుకడుగు వేస్తున్నారు. రెండు రోజులు సిటీ లో బస్సు నడిపిస్తే మూడో రోజు విధులకు హాజరు కావడంలేదు. పాఠశాలలు తెరిచే లోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూడాలని ఆర్టీసీ అధికారులను మంత్రి పువ్వాడ ఈ సందర్భంగా ఆదేశించారు.