
పాలమనేరు ఆసుపత్రిని తనిఖీ చేసిన అధికారిణి
చిత్తూరు
చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ వైద్యశాలను జిల్లా వైద్య సమన్వయ అధికారిణి సరళాదేవి బుధవారం తనిఖీ చేసారు. కాన్పు రోగులను పరామర్శించి వారికి వైద్య సేవలు సరిగా అందుతున్నాయా అడిగి తెలుసుకున్నారు. తరువాత అక్కడి రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి పేరుకు మాత్రం వంద పడకల ఆసుపత్రిగా ఉండగా 50 పడకల మాత్రమే ఉండడంతో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం స్పందించి నాబార్డు నిధుల నుండి అదనపు 50 పడకల కోసం 16 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని త్వరలో భవన నిర్మాణం చేపడతామని అన్నారు. ప్రసవం కోసం వచ్చేవారు చాలావరకు రక్తహీనతతో ఉన్నారని చాలామంది కూలినాలి చేసుకునే వారే కావడంతో ప్రతినెల పరీక్షలకు రాకుండా తొమ్మిదవ నెలలో మాత్రమే డెలివరీ కి వస్తున్నారని ఆమె అన్నారు. వారిని పరీక్షించిన తరువాత రక్తహీనత ఎక్కువగా ఉండడంతో వారిని చిత్తూరు లేదా తిరుపతికి రెఫర్ చేస్తున్నామని, గర్భం దాల్చినప్పటి ప్రతినెల ఆసుపత్రికి వచ్చిన డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్నవారికి మందులను పంపిణీ చేస్తామని చెప్పారు. దీంతో ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రావని, ఇక్కడ డాక్టర్ల కొరత లేదని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. గర్భం దాల్చిన అప్పటినుండి ప్రతినెల పరీక్షలు నిర్వహించుకోవాలని రక్తం వృద్ధి కొరకు తగిన మందులు అందజేస్తామని, తద్వారా సుఖప్రసవం అవుతుందని తెలిపారు