శాస్త్రోక్తంగా శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి
ఆలయంలో అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగంకు
అంకురార్పణ
తిరుపతి
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగంకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఆలయంలో అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగంలో భాగంగా బుధవారం ఉదయం టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఋత్విక్ వరణంలో పాల్గొన్నారు.
ఋత్విక్ వరణం :
ఆలయంలో బుధవారం ఉదయం ఋత్విక్వరణం జరిగింది. ఇందులో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన దాదాపు 150 మంది ఋత్వికులు, వారి సహాయకులు, ఇతర వేదపారాయణందారులు శ్రీవారి ఆజ్ఞ తీసుకున్నారు. ఆ తరువాత ఋత్వికులకు హోమగుండాల వద్ద స్థానాలను నిర్దేశించారు. ఈ సందర్భంగా స్వామివారు ఆశీర్వదించిన వస్త్రాలను ఋత్వికులకు అందజేశారు. ఈ వస్త్రాలను పసుపునీటిలో తడిపి ఋత్వికులు దీక్షా వస్త్రాలుగా ధరిస్తారు. మూడు రోజుల పాటు జరిగే యాగశాల కార్యక్రమాల్లో మాత్రమే ఈ పసుపు వస్త్రాలను ఋత్వికులు ధరిస్తారు.
అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఈవో, ఋత్వికులు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా యాగశాలకు చేరుకున్నారు. తరువాత ఈవో హోమగుండాలను, యాగశాలలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఋత్వికులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
అంకురార్పణ :
ఈ మహాయాగంలో భాగంగా అక్టోబరు 17న ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గో పూజ, శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబరు 18న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు గజపూజ, పూర్ణాహుతితో మహాయాగం ముగుస్తుంది.