ప్రయాణికులకు టికెట్ లు అందించాలి
- జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ లో ప్రయాణించే ప్రయాణికులకు తప్పనిసరిగా టికెట్లు అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రోజు జిల్లాలోని గోదావరిఖని, మంథని డిపోలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిపోల వద్ద బస్సులను సంబంధిత రూట్ల కు కేటాయించే పద్ధతిని కలెక్టర్ పరిశీలించారు. బస్సులను నిబంధనల ప్రకారం నడపాలని, ప్రయాణికుల వద్ద అధికంగా ఛార్జీలు వసూలు చేయడానికి వీలు లేదని అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. బస్సులో ప్రయాణికులకు టీమ్ యంత్రాలను ఉపయోగించి టికెట్లు అందించాలని, ప్రభుత్వం జారీ చేసిన విద్యార్థుల బస్ పాస్, దివ్యాంగుల బస్సు పాసు ,ఇతర ఉద్యోగ ,జర్నలిస్టు వర్గాలకు అందించే బస్సు పాస్ రాయితీలను రోడ్డు రవాణా సంస్థ బస్సులు లో తప్పనిసరిగా అమలు చేయాలని, బస్సులలో రూట్ లకు సంబంధించి చార్జీల వివరాలను అందరికీ కనిపించే విధంగా అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో నూరు శాతం రోడ్డు రవాణా సంస్థ బస్సులు ప్రయాణికులకు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, తాత్కాలిక సిబ్బందికి బస్సులు అప్పగించే ముందు డ్రైవర్లను డ్రంక్ అండ్ డ్రైవ్ చేక్ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామాలకు పల్లె వెలుగు బస్సు లను పూర్తిస్థాయిలో నడపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తాత్కాలిక సిబ్బందికి బస్సులను అప్పగించే ముందు బ్రీత్ అనలైజర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తున్నామని, జిల్లాలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ వాహనాలను మాక్సి క్యాబ్ లను సైతం ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు . డిపో మేనేజర్లు పోలీసు ఉన్నతాధికారులు సంబంధిత అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.