వర్ల రామయ్యకు నోటీసులు
విజయవాడ,
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి వర్ల రామయ్య కొన్ని ఆరోపణలు చేశారు. దీంతో సిట్ అధికారులు ఆయనకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. వర్ల రామయ్య చేసిన ఆరోపణలకి సంబంధించి సాక్ష్యాలు చూపించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును తారుమారు చేసేందుకు కుట్ర జరుగుతోందని రామయ్య ఆరోపించారు. ఈ కేసులో నిందితులెవరో జగన్‌కు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో సంబంధం లేని వారిని నిందితులుగా చూపించబోతున్నారని.. అందుకే సీబీఐ దర్యాప్తు కోరడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్దేశం అసలు నిందితుల్ని దాచిపెట్టి.. నకిలీవాళ్లను చూపించడమేనని ఆరోపించారు. ఈ కేసులో అసలు నిందితులు ఎవరో పులివెందులలో ఏ తలుపును కొట్టినా చెబుతారన్నారు వర్ల రామయ్య.వర్ల రామయ్య ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. తాజాగా నోటీసులు పంపారు. ఆయన చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలని నోటీసుల్లో కోరారు. మరి సిట్ పోలీసులు పంపిన ఈ నోటీసులపై వర్ల రామయ్య ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ ఆయన సమాధానం చెప్పని పక్షంలో సిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదిచూడాలి.