బీజేపీలోకి గంగూలీ...?
ముంబై,
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న దాదా.. బీసీసీఐ బాస్‌గా పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే గంగూలీ బీజేపీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. కమలనాథులు ఆయనతో టచ్‌లో ఉన్నారని.. 2021లో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతారని చెబుతున్నారు. అమిత్ షాతోనూ ఈ విషయమై ఆయన చర్చలు జరిపారని ప్రచారం జరుగుతోంది.తాను బీజేపీలో చేరబోతున్నానని వస్తున్న వార్తలపై సౌరభ్ గంగూలీ స్పందించారు. అమిత్ షాను తొలిసారి కలిశానన్న గంగూలీ.. ప్రస్తుతానికి అలాంటి రాజకీయ పరిణామాలేం లేవని స్పష్టం చేశారు. గతంలో తాను బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసిన సమయంలోనూ ఇలాంటి వార్తలు వచ్చాయన్నారు. ఇప్పటికైతే అలాంటి రాజకీయ పరిణామాలేం లేవని గంగూలీ చెప్పడాన్ని బట్టి.. ఆయన భవిష్యత్తులో బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవి ముగిశాక ఆయన కమలం గూటికి చేరే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం ద్వారా బెంగాల్‌లో దీదీకి షాకివ్వాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కమలదళం బెంగాల్‌లో 18 స్థానాల్లో గెలవడం ద్వారా మమతా బెనర్జీకి చెమటలు పట్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గంగూలీని సీఎం అభ్యర్థిగా బీజేపీ బరిలో నిలిపొచ్చని ప్రచారం జరుగుతోంది. తద్వారా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు.దాదా బీసీసీఐ చీఫ్‌గా ఎన్నిక కావడం లాంఛనం కానుంది. బీసీసీఐ అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు. 2017లో అనురాగ్ ఠాకూర్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక సుప్రీం కోర్టు ఆదేశాలతో 33 నెలల క్రికెట్ పరిపాలన కమిటీ పాలన సాగింది. అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా బాధ్యతలు స్వీకరించనుండగా.. కార్యదర్శిగా అమిత్ షా కుమారుడు జై షా బాధ్యతలు చేపడతారు