ఆర్టీసీ ఆస్తుల వివరాలడిగిన గవర్నర్ !
హైదరాబాద్
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్తో తెలంగాణలో కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ కేకే దివాకరన్, అన్ భజిగన్ తదితర జాతీయ నేతలు బుధవారం తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథ్థామ రెడ్డి జాతీయ యూనియన్ నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అశ్వథ్థామ రెడ్డి మాట్లాడుతూ.. 12వ రోజు కూడా సమ్మె ఉధృతంగా సాగుతోందని, కార్మికులు ఎవ్వరూ ప్రభుత్వ ట్రాప్లో పడొద్దని హెచ్చరించారు. అలాగే గవర్నర్ తమిళిసై ఆర్టీసీ ఆస్తుల గురించి వాకబు చేసినట్టు తెలిసిందని వెల్లడించారు. కేకే దివాకరన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తోన్న సమ్మెకు ప్రజా మద్దతు ఉందని, ఇక తమ మద్దతు కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 19న నిర్వహించనున్న బంద్కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు దివాకరన్ వెల్లడించారు. బంద్తో ప్రభుత్వం స్పందించకుంటే తదనంతరం తమ కార్యాచరణను ప్రకటిస్తామని దివాకరన్ స్పష్టం చేశారు.