ఉద్యమ ప్రజా నాయకులంతా రాజీనామా చేయాలి
పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఏనుగు మల్లారెడ్డి
జగిత్యాల
తెలంగాణ ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం కానుందని ఉద్యమ ప్రజానాయకులు అని చెప్పుకునే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు, అంతా వారి పదవులకు రాజీనామా చేసి ఆర్టీసీ సమ్మెలో పాల్గొనాలని పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు మల్లారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జగిత్యాల ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సమ్మెకు పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో నేతలు ఆర్టీసీ సమ్మె శిబిరాన్ని సందర్శించి కార్మికులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏనుగు మల్లారెడ్డి మాట్లాడుతూ కార్మిక ,కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, వాణిజ్య వ్యాపార, జర్నలిస్ట్, వర్గాలన్ని ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నారని మరో మూడు రోజుల తర్వాత ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రజాప్రతినిధులంతా మంత్రులు ఎమ్మెల్యేలతో సహా రాజీనామాలు చేసి ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనాలని లేనిపక్షంలో ప్రజలే ప్రజాప్రతినిధులకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, పౌర హక్కుల సంఘం నేతలు పోగుల రాజేశం, కడ రాజన్న, మోట పలుకుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.