ఇరకాటంలో గంటా
విశాఖపట్టణం,
మాజీ మంత్రి, విశాఖ జిల్లా రాజకీయాల్లో చాణక్యుడు అని పేరు తెచ్చుకున్న గంటా శ్రీనివాసరావు ఇపుడు పెద్ద ఇరకాటంలో పడిపోయారని అంటున్నారు. ఆయన ఉన్న తెలుగుదేశం పార్టీలో కూడా ఇపుడు పొగ పెట్టేస్తున్నారు. బయట పార్టీల నుంచి ఆఫర్లు ఉన్నా షరతులు వర్తిస్తున్నాయి. దాంతో గంటా శ్రీనివాసరావు బిగ్ ప్రాబ్లంలో పడిపోయారని ప్రచారం సాగుతోంది. గంటా శ్రీనివాసరావు ఈ మధ్య తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ మీటింగుకు ఒక్క రోజు మాత్రమే కనిపించి గంటా శ్రీనివాసరావు పక్కకు తప్పుకున్నారని కామెంట్స్ వచ్చాయి. అయితే అసలు విషయం ఏంటంటే గంటా శ్రీనివాసరావు నాలుగు నెలలు సైలెంట్ గా ఉండి ఇపుడు బాబు విశాఖ రాగానే ఆయన ముందు అచ్చమైన పసుపు తమ్ముడిలా హాజరైపోయారు కానీ గండరగండడు చంద్రబాబుకు ఈ రాజకీయం తెలియనిది కాదు కదా.ఇక విశాఖ తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశంలో చంద్రబాబు సీనియర్లకు పెద్ద షాకే ఇచ్చేశారని సమాచారం. పార్టీలో ఎవరు ఉన్నా పోయినా కూడా ఏం కాదంటూ బాబు మాట్లాడిన మాటలు గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి మాత్రమేనని అంటున్నారు. పార్టీకి కార్యకర్తలు ఉంటే చాలు, నాయకులు పార్టీ వల్ల వచ్చారు కానీ నాయకుల వల్ల పార్టీ లేదని బాబు తెగేచెప్పారని అంటున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు ఈ మధ్య ఇతర పార్టీలలోకి వెళ్తారని వచ్చిన పుకార్లను కూడా బాబు పరిగణనలోకి తీసుకునే ఈ రకమైన హెచ్చరికలు పంపారని అంటున్నారు. పాతవారు, సీనియర్లు వెళ్ళిపోతే కొత్త వారితో పార్టీని బలోపేతం చేస్తామని కూడా బాబు అన్నట్లుగా చెబుతున్నారు.ఇప్పటికైతే గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలోకి వెళ్లలేని స్థితిలో ఉన్నారు. ఆయనకు వైసీపీ నుంచి ఆఫర్ ఉన్నట్లుగా ప్రచారం జరిగినా జగన్ పెట్టిన షరతులు మింగుడుపడడంలేదు. మొన్ననే భారీగా ఖర్చు చేసి మరీ విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు గెలిచారు. ఆ పదవికి రాజీనామా చేయమంటే గంటా శ్రీనివాసరావు ససేమిరా అన్నట్లుగా భోగట్టా. ఇక మళ్ళీ టికెట్ కూడా ఇస్తారో లేదో హామీ లేదు. అసలు రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర ఉండదని వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్ బట్టి తేలిన సమాచారమట. ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావు వెళ్ళడానికి ముందూ వెనకా ఆడుతున్నారట. మరో వైపు ఏపీలో పెద్దగా లేని బీజేపీ పిలిచినా కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వెళ్ళాలి. దాంతో రాయబేరాలు తెగక గంటా శ్రీనివాసరావు మౌనంగా ఉంటున్న నేపధ్యంలో అదను చూసి మరీ బాబు గురి పెట్టి టార్గెట్ చేశారని అంటున్నారు. ఇపుడు గంటా శ్రీనివాసరావు బయటకు వెళ్ళినా బేరమాడే శక్తి కోల్పోతారు, అలాగని టీడీపీలో ఉన్నా మునుపటి ఆదరణ అధినేత వద్ద ఉంటుందా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్.