ఇక ఈజీగా పాస్ పోర్టు వెరిఫికేషన్
కర్నూలు,
పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం రోజుల తరబడి దరఖాస్తు దారుడు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై వెరిఫికేషన్ ప్రక్రియ దరఖాస్తు దారుడితో నిమిత్తం లేకుండానే ఆయా ప్రాంత పోలీసుస్టేషన్, డీసీఆర్‌బీలో అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ ద్వారాను నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పాస్‌పోర్టు దరఖాస్తు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయానికి వచ్చిన మూడు రోజులలోపే పూర్తి చేస్తారు.సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దరఖాస్తుదారుడితో నిమిత్తం లేకుండా వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో పాస్‌పోర్టు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మరుసటి రోజు వెరిఫికేషన్ నిమిత్తం జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొంటారు. దరఖాస్తు సమయంలో సమర్పించిన పుట్టిన తేదీ ధ్రువీకరణపత్రం, ఆధార్‌కార్డు, విద్యార్హత, పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్లను క్షేత్రస్థాయిలో పరిశీలన నిమిత్తం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి పరిశీలించే వారు. చుట్టు పక్కల వారిని విచారించి దరఖాస్తుదారుడు ప్రవర్తనపై ఆరా తీయడంతో పాటు దరఖాస్తుదారుడి వద్ద సంతకాలు సేకరించేవారు. అతనిపై ఏవైనా కేసులు ఉన్నాయో లేవో ఆయా ప్రాంత పోలీస్‌స్టేషన్లలో తెలుసుకుని దాని ఆధారంగా నివేదిక తయారు చేసేవారు. ఈ ప్రక్రియ పూర్తిచేయడంలో అనేక సమస్యలు ఉండేవి. కొన్నిసార్లు దరఖాస్తుదారుడు అందుబాటులో లేకపోవడం, మరికొన్ని సార్లు వెరిఫికేషన్‌లో ఆలస్యం అవుతుండటం, కొన్నిచోట్ల వెరిఫికేషన్ పేరిట దరఖాస్తుదారుడి ఇబ్బందులకు గురిచేయడం తదితరాల కారణంగా పాస్‌పోర్టు రావడం ఆలస్యం అయ్యేది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేసింది.