ఓటమి నుంచి కోలేకోని ఆకేపాటి
కడప,
రాజకీయాల్లో ఒక్క గెలుపు ఎంత ఊపునిస్తుందో.. అదేసమయంలో ఒక్క ఓటమి కూడా నాయకుల తలరాతలను మారుస్తుంద నడానికి ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజకీయమే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన ఆకేపాటి.. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. వైఎస్ హయాంలో కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఆ పార్టీ టికెట్‌పై 2009లో రాజంపేట నుంచి విజయం సాధించారు. వైఎస్‌కు అత్యంత నమ్మకస్తుడైన నాయకుల్లో ఆకేపాటి అమర్నాధరెడ్డి ఒకరు. వైఎస్ మరణం, తర్వాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పుల నేపథ్యంలో ఆకేపాటి అమర్నాధరెడ్డి వైఎస్ కుమారుడు, ప్రస్తుత సీఎం జగన్‌కు జై కొట్టారు. ఆయన స్థాపించిన వైసీపీలోకి చేరిపోయారు.
ఈ క్రమంలోనే 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లోనూ ఆయన రాజంపేట నుంచి వైసీపీ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. జగన్ ఏ కార్యక్రమం తలపెట్టినా.. ముందుండి, పార్టీ కోసం పని చేసిన నాయకుల్లో ఆకేపాటి అమర్నాధరెడ్డి ఒకరు. ఆయనపై నమ్మకంతో జగన్ జిల్లా వైసీపీ పగ్గాలు కూడా ఇచ్చారు. ఇక, 2014 ఎన్నికలకు వచ్చే సరికి జగన్ మరోసారి ఆకేపాటి అమర్నాధరెడ్డికి ఇదే టికెట్‌ను ఇచ్చారు. అయితే, అదే సమయంలో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున మేడా మల్లికార్జున రెడ్డి పోటీ చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య హోరా హోరీ పోరు సాగింది. మొత్తంగా అప్పట్లో జిల్లా మొత్తం వైసీపీ గెలుపు గుర్రం ఎక్కినా.. ఒక్క రాజంపేటలో మాత్రం ఆకేపాటి అమర్నాధరెడ్డి ఓడిపోయారు. టీడీపీ నుంచి బరిలో నిలిచిన మేడా విజయం సాధించారు. ఇక, ఆ తర్వాత కూడా ఆకేపాటి అమర్నాధరెడ్డి వైసీపీ అభివృద్ధి కోసం కృషి చేశారు.జిల్లా వైసీపీ అధ్యక్షుడి హోదాలో ఆకేపాటి అమర్నాధరెడ్డి జిల్లాలో అన్ని సీట్లు గెలిపించినా రాజంపేటలో మాత్రం ఆకేపాటి ఓడిపోయారు. అయితే, రానురాను రాజకీయ సమీకరణలు మారిపోవడంతో టీడీపీలో గెలిచిన మేడా ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. అయితే, జిల్లాలో ఈ ఒక్క స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీని నిలువరించేందుకు మేడాను పార్టీలోకి తీసుకోవడమే ఉత్తమమని భావించిన జగన్.. ఆయనను వెంటనే పార్టీలోకి తీసుకున్నారు. అప్పటకే ఉన్నఆకేపాటి అమర్నాధరెడ్డికి తర్వాత కాలంలో టీటీడీ ఛైర్మన్ గా అవకాశం ఇస్తామన్నారు. అదేసమయంలో కుదిరితే.. ఎమ్మెల్సీగా కూడా ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు జగన్. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో తన టికెట్ ను సైతం త్యాగం చేసిన ఆకేపాటి అమర్నాధరెడ్డి మేడా విజయం కోసం కృషి చేశారు.
అయితే, పార్టీ అధికారంలోకి వచ్చినాలుగు మాసాలైనా కూడా ఆకేపాటి అమర్నాధరెడ్డిని ఎవరూ పట్టించుకోలేదు. టీటీడీ బోర్డులో సభ్యుల సంఖ్యను పెంచినా.. ఆకేపాటి అమర్నాధరెడ్డికి అవకాశం చిక్కక పోవడం గమనార్హం. ఇక, అదే సమయంలో ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ కూడా నెరవేరలేదు. నిజానికి చాలా మంది 2014లో ఓడినా.. తర్వాత పుంజుకున్నారు. ఈ క్రమంలో జగన్ వారికి ఎన్నికల్లో ఎక్కడో ఒక చోట టికెట్లు ఎకామడేట్ చేశారు. కానీ, ఆకేపాటి అమర్నాధరెడ్డి విషయానికి వస్తే.. మాత్రం అంతా తలకిందులైంది. 2014లో ఆయన గెలుపు గుర్రం ఎక్కి ఉంటే.. ఇప్పుడు ఆకేపాటి అమర్నాధరెడ్డి పరిస్థితి వేరేగా ఉండేదని అంటున్నారు పరిశీలకులు. కానీ, ఇప్పుడు ఆకేపాటికి ఆ ఒక్క ఓటమి తీరని ఆగాధాన్ని సృష్టించిందని చెబుతున్నారు. మరి ఇప్పటికైనా జగన్ ఆకేపాటి అమర్నాధరెడ్డికి సముచిత గౌరవం ఇస్తారో లేదో చూడాలి.