కమలానికి కొత్త అధ్యక్షుడు..?
న్యూఢిల్లీ,
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కొత్తనేత బాధ్యతలను చేపట్టబోతున్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తవుతుంది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత నూతన అధ్యక్షుడి నియామకం ఉంటుంది. ఇప్పటి వరకూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా రెండు దఫాలుగా ఉంటున్నారు. బీజేపీ నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకొకసారి నూతన అధ్యక్షుడి నియామకం జరగాల్సి ఉంటుంది.అమిత్ షా 2014 తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా, ప్రధానిగా నరేంద్ర మోడీ జోడీ పూర్తిగా సక్సెస్ అయింది. అనేక రాష్ట్రాల్లో వీరి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తమకు దక్కవని భావించిన రాష్ట్రాలు కూడా బీజేపీ దక్కించుకోవడం వెనక అమిత్ షా వ్యూహం ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. వీరి జోడి విక్టరీకి సంకేతంగా ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ క్యాడర్ భావిస్తుంది.ఇటు సంఘ్ పరివార్ ఆలోచనలు అమలు చేస్తూనే మరోవైపు బీజేపీ బలోపేతానికి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం అనేక సార్లు పార్టీలోనూ చర్చనీయాంశమైంది. నిజానికి అమిత్ షా 2019 ఎన్నికలకు ముందే పదవి నుంచి దిగిపోవాల్సి ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఆయనను పదవిలో కొనసాగించారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు.బీజేపీ నూతన అధ్యక్షుడిగా జేపీ నడ్డాను నియమించే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఆయన అమిత్ షా, మోడీలకు నమ్మిన బంటు. వీరిద్దరూ గీచిన గీత దాటరని పేరుంది. దీంతో బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను నియమించి వెనక నుంచి చక్రం తిప్పవచ్చన్నది వీరి వ్యూహంగా కన్పిస్తుంది. జేపీ నడ్డా అధ్యక్షుడిగా ఎన్నికైనా అంతా అమిత్ షా కనుసన్నల్లోనే నడుస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 2024 ఎన్నికల వరకూ బీజేపీ ఇదే స్ట్రాటజీలో వెళ్లే అవకాశముంది