టీడీపీ ఓటు బ్యాంక్ పై గురి
విజయవాడ,
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముప్ఫయి ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నది తన టార్గెట్ అని ఎన్నికలకు ముందు చెప్పారు. అందుకు అనుగుణంగానే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని బలహీన పర్చడంతో పాటు తమ ఓటు బ్యాంకును మరింత పటిష్టపర్చుకోవాలన్నది జగన్ వ్యూహంగా కన్పిస్తుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఏ సామాజికవర్గమూ మద్దతివ్వకుండా ముందుగానే జగన్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు జరుగుతున్న పరిస్థితులను బట్టి అర్థమవుతుంది.ఆంధ్రప్రదేశ్ లో బలమైనది కాపు సామాజిక వర్గం. ఓట్ల శాతాన్ని తీసుకున్నా కాపు సామాజిక వర్గానిదే ఆధిపత్యం. 2014 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం చంద్రబాబుకు అండగా నిలవడం వల్లనే గెలుపు సాధ్యమయింది. అయితే ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను అమలుపర్చకపోవడంతో ఈసారి ఆ సామాజిక వర్గం ఆయనకు దూరమయింది. ప్రధానంగా కాపు రిజర్వేషన్ల విషయంలో వారు చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారు. జగన్ కూడా తన పాదయాత్రలో కాపు రిజర్వేషన్లపై కుండబద్దలు కొట్టేశారు. అది తన చేతిలో లేదని, కేంద్ర ప్రభుత్వమే చేయాల్సి ఉంటుందని చెప్పి అప్పట్లో కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనక ఈ సామాజిక వర్గం నిలబడాల్సి ఉంది. అయితే పవన్ కల్యాణ్ తీసుకున్న రాజకీయ వైఖరి దృష్ట్యా గత ఎన్నికల్లో ఆయన వైపు కాపు సామాజికవర్గం పెద్దగా చూడలేదన్నది అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ కు వచ్చిన ఓట్లలో ఎక్కువ ఓట్లు అదే సామాజిక వర్గానికి చెందినవని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే పవన్ కల్యాణ్ పై ఆ సామాజిక వర్గంలో నమ్మకం లేదు. పవన్ నిలకడలేని మనస్తత్వం, అధికారంలోకి వస్తారన్న ఆశలేకపోవడంతో గత ఎన్నికల్లో్ కాపుల్లో ఎక్కువ మంది జగన్ వెంట నిలిచారు.అందుకే కాపు సామాజిక వర్గాన్ని జగన్ దగ్గరకు తీస్తున్నారని చెబుతున్నారు. వచ్చేఎన్నికల్లో తనకు కాపు సామాజిక వర్గం అండగా నిలబడాలని కోరుకుంటున్నారు. అందుకే ఇప్పటికే ఆ సామాజికవర్గం నేతలు తోట త్రిమూర్తులు, ఆకుల సత్యనారాయణ వంటి నేతలను పార్టీలోకి చేర్చుకున్నారు. వీరి అవసరం ప్రస్తుతం లేకపోయినా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకునే వీరిని చేర్చుకున్నారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవితో భేటీ కావడం వెనక కూడా ఇదే ఆలోచన అంటున్నారు. రానున్న కాలంలో కాపు సామాజిక వర్గం నేతలను మరింత మందిని చేర్చుకునేందుకు జగన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఏపీలో బలమైన సామాజికవర్గానికి జగన్ వల వేస్తున్నట్లు అర్థమవుతుంది.