తిరుమలనంబి ఆలయంలో అక్టోబరు 21 నుండి వార్షికోత్సవాలు
తిరుపతి
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఉప ఆలయమైన శ్రీ తిరుమలనంబి ఆలయంలో అక్టోబరు 21 నుండి 30వ తేదీ వరకు వార్షికోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అక్టోబరు 30వ తేదీన శ్రీ తిరుమలనంబి సాత్తుమొర సందర్భంగా ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారిని తిరుమలనంబి ఆలయానికి వేంచేంపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు అలంకార శోభితుడైన శ్రీగోవిందరాజస్వామివారు ఉభయనాంచారులు, తిరుమలనంబితో కలసి తిరుమాఢవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. అనంతరం తిరుమలనంబి ఆలయంలో ప్రబంధపారాయణం, సాత్తుమొర, నైవేద్యం జరగనుంది. ఈ సందర్భంగా తిరుమల నుండి శ్రీవారి అప్పం తిరుమలనంబికి చేరుతుంది.
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి కైంకర్యాలు చేసేందుకు తిరుమలనంబి క్రీ.శ 973వ సంవత్సరంలో తిరుమలకు చేరుకున్న మొట్టమొదటి శ్రీ వైష్ణవుడు. ఆయన తన తాతగారు అయిన యమునాచార్యుడి ఆజ్ఞతో తిరుమలకు వచ్చి పాపవినాశనము తీర్థం నుండి ప్రతిరోజూ జలాన్ని తీసుకొచ్చి శ్రీవారికి అభిషేకం చేసేవారు. వృద్ధాప్యంలో కూడా పాపనాశనం తీర్థం తీసుకువచ్చినప్పుడు స్వామివారు జాలిపడి అంజనాద్రిలో తీర్థం ఉద్భవింపచేసిన ఆకాశగంగ తీర్థంతో అభిషేకం చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. స్వామివారికి పుష్పకైంకర్యం, మంత్రపుష్పకైంకర్యం, ఇతర కైంకర్యాలను చేస్తూ తిరుమలలో ఉంటూ తిరుమలనంబి అపరభక్తుడిగా నిలిచాడు. శ్రీమద్ రామానుజాచార్యులకు రామాయణంలోని 18 రహస్యార్థాలను తెలియజేశారు.