దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం పకడ్బందీగా అమలు చేయాలి
- జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి
ములుగు
జిల్లాలోని దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలుచేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ లో అధికారులతో ప్లాస్టిక్ నిషేధ అమలుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వన దేవతలకు నెలవైన మేడారంలో వనాలను నాశనం చేసే ప్లాస్టిక్ ను పూర్తిగా బహిష్కరించే విధంగా ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. అలనాడు రాజులు వనాలను ధ్వంసం చేసే వారని, ఈ రోజు ప్లాస్టిక్ మహమ్మారి పర్యావరణానికి ముప్పుగా వాటిల్లి, వనాల నాశనానికి దోహదకారి అవుతుందని ఆయన అన్నారు. ఆలయాల్లోకి ప్లాస్టిక్ తో అనుమతించకూడని, దీనిని ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. రాబోయే మహా జాతర మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా జరుపుకునేట్లు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ప్రవేశాల వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి, ప్లాస్టిక్ తనిఖీలు చేయాలని, ఆ పిదప మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్లాస్టిక్ ఫ్రీ ప్రదేశాలు, ప్లాస్టిక్ తేవద్దు అనే బోర్డు లు కనిపించే విధంగా ప్రదర్శించాలని కలెక్టర్ అన్నారు. ప్రతి ఆలయం వద్ద త్రాగునీటి వసతి కల్పించాలని, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ సంచులు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. లక్నవరం, రామప్ప, బోగత, చింతామణి జలపాతం వద్ద ప్లాస్టిక్ తో తీవ్ర సమస్యలు వస్తున్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి, ప్లాస్టిక్ నిషేధ అమలును పటిష్టం గా అమలు చేయాలని అన్నారు. దీపావళి లోగా జిల్లాలోని ఆలయాలన్ని ప్లాస్టిక్ ఫ్రీ ఆలయాలుగా రూపు దిద్దుకోవాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో డిఆర్డీవో వసంత రావు, ఎండోమెంట్ ఏసీ ఆర్. సునీత, ఎడి పి. నాగరాజు, డిఇ ఏకాంబర్, కన్సర్వేషన్ అసిస్టెంట్ ఏఎస్ఐ మల్లేశం, టూరిజం అధికారి ఎం. శివాజీ, ఎఫ్ఆర్వోలు మాధవి షీతల్, ఎం. రామ్ మోహన్, మేడారం ఇఓ టి. రాజేందర్, రామప్ప ఇఓ కె. బాలాజీ, జనరల్ మేనేజర్ ఎం. నిలంజన్, మేనేజర్ టి. ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.