YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

30 డేస్ ఛాలెంజ్ (కరీంనగర్)

30 డేస్ ఛాలెంజ్ (కరీంనగర్)

30 డేస్ ఛాలెంజ్ (కరీంనగర్)
కరీంనగర్, : 30 రోజుల ప్రణాళిక.. గ్రామాల్లో సమూల మార్పులు తీసుకొచ్చింది.. గ్రామంలోని  సమస్యలను పారదోలాలన్న సంకల్పంతో గ్రామస్థులు కలిసికట్టుగా కదిలి పల్లె ప్రగతికి బాటలు వేశారు. నెల రోజుల పాటు చేపట్టిన ప్రణాళిక పనులతో అనేక గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలకు మోక్షం లభించింది.. పాడుబడి కూలడానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కూల్చివేత, పాడు బావుల పూడ్చివేత, నిరుపయోగంగా ఉన్న బోరుబావులను కప్పిపెట్టడం, రహదారులపై నీరు నిలుస్తున్న ప్రదేశాలతో పాటు పెద్ద గుంతలను సైతం గుర్తించి సరి చేశారు. పేరకుపోయిన చెట్ల పొదలను తొలగించడం, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలను శుభ్రం చేశారు. ఇంటింటికి మరుగుదొడ్డి నినాదంతో సరిపెట్టకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉందా, ఉన్నా వినియోగిస్తున్నారా లేదా అని పరిశీలించి, సమస్య పరిష్కారానికి కృషి చేశారు. జిల్లాలోని 313 గ్రామ పంచాయతీల్లో వాస్తవాలకు దగ్గరగా వార్షిక ప్రణాళికలు రూపొందించడంతో పాటు పల్లెల్లో పచ్చదనం కోసం గ్రీన్‌ ప్లాన్‌ తయారు చేశారు. దాంతో పాటు ప్రతి పంచాయతీలో గ్రామ సభ నిర్వహించి కో ఆప్షన్‌ సభ్యులు, స్టాడిండ్‌ కమిటీ సభ్యుల ఎంపిక పూర్తి చేశారు. అన్ని పంచాయతీల్లో 1749 శిథిలాలను గుర్తించగా.. 1431 తొలగించారు. పిచ్చి మొక్కలతో పెరిగిన 12413 పొదలను గుర్తించగా.. 12385 పొదలను తొలగించారు. అలాగే 1365 ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోగా.. 1347 చోట్ల పూర్తిగా చెత్తను తొలగించారు. 465 పాడుబడ్డ బావులను గుర్తించగా 385 బావులను పూడ్చివేశారు. నిరుపయోగంగా ఉన్న 183 బోరుబావులను గుర్తించి, ప్రమాదాలకు తావులేకుండా చర్యలు చేపట్టారు. 967 నీరు నిలుస్తున్న ప్రాంతాలను గుర్తించి 965 చోట్ల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. 2270 మురికి ప్రాంతాలను గుర్తించి అన్ని చోట్ల బ్లీచింగ్‌ చల్లారు. రహదారులపై 3970 గుంతలను గుర్తించి, వాటిని సరిచేశారు. 554 అంగన్‌వాడీ కేంద్రాలు, 321 ప్రైమరీ, 102 అప్పర్‌ ప్రైమరీ, 120 ఉన్నత పాఠశాలలు, 122 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, 422 సామాజిక భవనాలతో పాటు ఇతరేతర ప్రైవేటు స్థలాలల్లో పరిశుభ్రత పనులు చేపట్టారు.
జిల్లాలో ఇప్పటివరకు 253 నర్సరీలను ఏర్పాటు చేశారు. మరో 45 చోట్ల స్థలాలను గుర్తించారు. హరితహారంలో భాగంగా దోమల నివారణను దృష్టిలో ఉంచుకొని 1249615 తులసి మొక్కలను పంపిణీ చేశారు. అలాగే తడి, పొడి చెత్త సేకరణ విడిగా చేపట్టడానికి వీలుగా 162354 చెత్త బుట్టలను పంపిణీ చేశారు. జిల్లాలో గుర్తించిన 3957 వదులు తీగల సమస్యను పరిష్కరించారు. పడిపోవడానికి సిద్ధంగా ఉన్న 1846 విద్యుత్తు స్తంభాలను మార్చి కొత్తవి వేశారు. అలాగే 11845 చోట్ల మూడో విద్యుత్తు లైన్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 159 డంపింగ్‌ యార్డులకు స్థలాల సేకరణ పూర్తయింది. మరో 121 చోట్ల స్థలాలను గుర్తించగా, 33 పంచాయతీల్లో స్థలాలను గుర్తించాల్సి ఉంది. అన్ని పంచాయతీల్లో శ్మశాన వాటికలను ఏర్పాటు చేయడంలో భాగంగా 105 పంచాయతీల్లో స్థలాలను గుర్తించి, సేకరించారు. మరో 168 పంచాయతీల్లో స్థలాల గుర్తింపు పూర్తయింది. 40 చోట్ల ఇంకా స్థల గుర్తింపు జరగాల్సి ఉంది.

Related Posts