ముదిరిన సంక్షోభం (కర్నూలు)
కర్నూలు, : జిల్లాలోని పత్తి పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రకృతి సహకరించకపోవడంతోపాటు ప్రభుత్వ తోడ్పాటు లేకపోవడం వల్ల ఖాయిలా పడుతున్నాయి. పారిశ్రామికీకరణ దేవుడెరుగు ఉన్నవి నిలబడితే చాలు నాయనా అంటూ యజమానులు బిక్కుబిక్కున కాలం గడుపుతున్నారు. ఆదోని పత్తి పరిశ్రమలకు పెట్టింది పేరు. ఇక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డుకు వెల్లువలా వచ్చే పత్తి దిగుబడుల కారణంగా అనుబంధంగా వ్యాపారులు ఎన్నో పరిశ్రమలను నెలకొల్పారు. ఏటా లక్షల క్వింటాళ్ల కొద్ది పత్తి అమ్మకానికి వస్తుంది. ఒకప్పుడు స్వర్ణయుగంలా నడిచిన పరిశ్రమలు..ప్రస్తుతం మూతబడే దిశగా అడుగులేస్తున్నాయి. కారణం పత్తి సాగు పడిపోవడంతోపాటు ప్రభుత్వం నుంచి చేయూత కరవవ్వడమే. ప్రభుత్వం పారిశ్రామికీకరణ విస్తరణకు నాంది పలకడంతో చిన్న పరిశ్రమలు కాస్తా.. పెద్ద పరిశ్రమలుగా మార్పు చెందాయి. ఎంతోమంది టీఎంసీ యూనిట్లను నెలకొల్పారు. ఒకప్పుడు 80 దాకా పత్తి పరిశ్రమలు ఉండేవి. ప్రస్తుతం 50 ఉన్నాయి. ఇందులో 25 టీఎంసీ, 25 చిన్న పరిశ్రమలు. వీటిలో దాదాపు చిన్న పరిశ్రమలు నడవడం లేదు. టీఎంసీ యూనిట్లు అయిదారు దాకా మూతబడ్డాయి. పారిశ్రామికీకరణ విస్తరణలో భాగంగా పలు పరిశ్రమలు స్థాపించారు. ప్రధానంగా అందే రాయితీలు విద్యుత్తు, అమ్మకపు పన్ను, బ్యాంకు రుణంపై పావలా వడ్డీ రాయితీ ఉంటాయి. విద్యుత్తు యూనిట్‌పై రూ.6.35 ఉంటే 75 పైసలు రాయితీ, అమ్మకపు పన్ను రాయితీ 50 శాతం మినహాయింపు, బ్యాంకు రుణంపై 25 పైసలు వడ్డీ రాయితీ, 2015-20 ఏడాదికి సంబంధించి పరిశ్రమలకైతే యంత్ర పరికరాలపై వంద శాతం రీయంబర్స్‌మెంట్ వర్తింపజేస్తున్నారు. దీంతో ప్రభుత్వం అందిస్తున్న చేయూతను ఆసరాగా చేసుకుని చాలామంది పరిశ్రమలను ప్రారంభించారు. తీరా నిర్వహణకు వచ్చేసరికి ఎలాంటి చేయూత అందకపోవడంతో తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఇలా గత నాలుగైదేళ్లుగా పరిశ్రమలకు రావాల్సిన రాయితీలు ఏకంగా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. గత ఎనిమిదేళ్లుగా పోలిస్తే పరిశ్రమలకు రావాల్సిన దిగుబడులు సగానికి సగం పడిపోయాయనే చెప్పాలి. 2010-11లో పత్తి దిగుబడులు అధికం, పరిశ్రమలు తక్కువ. ప్రస్తుతం పరిశ్రమలకు ఎక్కువ.. దిగుబడి తక్కువగా మారింది. కారణం ప్రకృతి సహకరించక కరవు వల్ల సాగు పడిపోవడం, చీడపీడల బాధలతో అరకొర పంటతో మార్కెట్లు నడుస్తున్నాయి. పోటీ వాతావరణంలో కనీసం పరిశ్రమలను నడుపుకొనేందుకైనా పత్తి దొరికితే చాలు అంటూ యార్డులకు వస్తున్నారు వ్యాపారులు. 2013లో 8 లక్షల పత్తి బేళ్లు వస్తే, 2018లో 2.5 లక్షల పత్తి బేళ్లు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఎంతటి గడ్డు పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్ఛు ఒక్క టీఎంసీ యూనిట్ నడవాలంటే రోజుకు కనీసం వెయ్యి క్వింటాళ్ల పత్తి, చిన్న పరిశ్రమలకైతే 100-200 క్వింటాళ్ల దాకా పత్తి కావాలి. ఆ స్థాయిలో పరిశ్రమలు ఉన్నా, పంటలు లేకపోవడం, ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహకారం లేకపోవడంతో కష్టాలను తెచ్చిపెట్టింది. పరిశ్రమలు నడవకపోడం వల్ల వ్యాపారులతో పాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి పైగా కార్మికులపై ప్రభావం పడింది. సరైన ఉపాధి మార్గాలు లేక వేరే పని తెలియక, జనం హోటళ్లు, గుమస్తా, పారిశుద్ధ్య పనులకు వెళుతున్నారు. ఉత్పత్తి తగ్గిపోవడం, సర్కారుకు చెల్లించాల్సిన పన్నులు దగ్గర నుంచి బ్యాంకు లావాదేవీల వరకు అన్నింటా స్తంభించిపోయాయి. అంతిమంగా ప్రభుత్వం సైతం ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ గోడు విని చేయూతనందించాలని వ్యాపారులు కోరుతున్నారు.