ప్లాన్ 30.. (ఖమ్మం)
ఖమ్మం, : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 30 రోజుల ప్రణాళిక సత్ఫలితానిచ్చింది. పల్లెల్లో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలకు చాలా వరకు పరిష్కారం లభించింది.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. కార్యక్రమం అమలుకు ఎప్పటికప్పుడు శ్రేణులను సిద్ధం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేసి తగిన సూచనలు, సలహాలు అందించారు. కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించారు. పారిశుద్ధ్య పనులు, పాడుబడ్డ బావులు, బోర్లు పూడ్చివేశారు. శిథిల భవనాలు కూల్చివేశారు. చెత్తతోపాటు సర్కారు తుమ్మ, పిచ్చి మొక్కలు తొలగించారు. విరిగిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్తవి వేశారు. విద్యుత్తు తీగలను సరిచేశారు. ఖాళీ ఇళ్ల స్థలాలు ఉంటే వాటిలోని నీటిని తీసివేశారు. మురుగు కాలువలు శుభ్రం చేయడమే కాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం రానున్న రోజుల్లోనూ కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడంతో గ్రామాలకు మంచి రోజులు రానున్నాయి. దోమల వ్యాప్తి నిరోధానికి కృష్ణతులసీ మొక్కలను ఉభయ జిల్లాల్లో పెద్ద ఎత్తున నాటించారు. ఖమ్మం జిల్లాలో 1,59,525, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8,900 మొక్కలు వేశారు. భద్రాద్రి జిల్లాకు 6,86,404 మొక్కలు రాగా మిగతా వాటిని నాటించే పనిలో పడ్డారు. విద్యుత్తు శాఖకు సంబంధించి ఖమ్మం జిల్లాలో 6,932 తీగలను సరిచేశారు. 2,035 కొత్త స్తంభాలు వేశారు. 11,367 ఎల్‌ఈడీ బల్బులు బిగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,456 తీగలను సరిచేశారు. 988 కొత్త స్తంభాలు వేశారు. 12,827 ఎల్‌ఈడీ బల్బులు బిగించారు. కొన్నేళ్లుగా గ్రామీణ జనాలను వెంటాడుతున్న విద్యుత్తు సమస్యలకు చరమగీతం పాడారు. కలెక్టర్‌ల కోటాలో రూ.2 కోట్లు తాజాగా విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. కలెక్టర్ విచక్షణ మేరకు వీటిని గ్రామాభివృద్ధికి వినియోగించాల్సి ఉంటుంది. కలెక్టర్ చేతిలో నిధుల కారణంగా పక్కాగా అభివృద్ధికి ఆస్కారం ఏర్పడనుంది. ఇటీవలే ముగిసిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా జనాభా ప్రతిపాదికన 14వ ఆర్థిక సంఘం నిధులు ఖమ్మం జిల్లాకు రూ.10 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 7.68 కోట్లు వచ్చాయి. ఎస్‌ఎఫ్‌సీలో భాగంగా ఖమ్మం జిల్లాకు రూ.6.70 కోట్లు, భద్రాద్రి జిల్లాకు రూ.5.14 కోట్లు విడుదలయ్యాయి. ఇలా మొత్తం ఖమ్మం జిల్లాకు రూ.16.70 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.13.82 కోట్లు అందాయి. ఆయా సొమ్ము కోశాధికారి కార్యాలయంలో జమ అయ్యాయి. అనంతరం గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేశారు. సీఎం కేసీఆర్ మాటలు 30 రోజుల్లో వాస్తవ రూపం దాల్చాయి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగం నిర్విరామంగా శ్రమించింది. సెలవు రోజుల్లోనూ గ్రామ ప్రణాళిక అమలు పనుల్లోనే పాల్గొన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా పల్లెల అభివృద్ధి పనుల్లో భాగస్వాములయ్యారు. కొన్నిచోట్ల దాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందించారు. మొత్తం మీద పల్లె రూపురేఖలు కొంత మారాయి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరికింది. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలకు స్థలాలు గుర్తించారు. గ్రామాభివృద్ధికి వార్షిక, పంచ వర్ష ప్రణాళికలు రూపొందించి, గ్రామసభల్లో ఆమోదం పొందారు. నెల రోజుల్లో గుణాత్మకమైన మార్పులు పల్లెల్లో చోటు చేసుకోవటం గమనార్హం.