‘వైఎస్సార్ నవోదయం’ ప్రారంభించిన సీఎం జగన్
అమరావతి:
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలను ఆదుకునేందుకు ‘వైఎస్సార్ నవోదయం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి గురువారం సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎంఎస్ఎంఈలకు ఈ పథకం చేయూతనిస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు 80,000 యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు సీఎం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ నవోదయం పథకం కింద ఎంఎస్ఎంఈలకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్ సమీక్ష : ఇళ్ల స్థలాల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం వైఎస్ జగన్ పలు ముఖ్య సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు