రుణం.. భారం.. (విశాఖ)
విశాఖపట్నం, : రాయితీ రుణాల ప్రక్రియ గందరగోళంగా మారింది. వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ రుణాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. గతంలో దరఖాస్తు చేసిన వారు మరోసారి దరఖాస్తు చేయొద్దని ప్రభుత్వం సూచించింది. అయితే 2018-19లో దరఖాస్తు చేసి, రుణం మంజూరుకాని వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరు గత ఏడాది రుణం కోసం బ్యాంకు ఖాతాను తెరిచారు. సబ్సిడీ సైతం మంజూరైంది. తీరా రుణం అందలేదు. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సాధారణంగా ప్రతీ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకం కోసం సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తోంది. వెబ్‌సైట్ ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. యూనిట్ ఖరీదులో 50శాతం, గరిష్ఠంగా రూ.లక్ష వరకు ఆయా కార్పొరేషన్లు రాయితీని విడుదల చేస్తుంటాయి. జిల్లాకు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా అధికారులు నిధులను కేటాయిస్తుంటారు. వచ్చిన దరఖాస్తుల్లో మండల, మున్సిపల్, జోనల్ కార్యాలయాల్లో కమిటీ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారి రుణ ఖాతాలో రాయితీ సొమ్ము జమచేస్తారు. తర్వాత మిగిలిన మొత్తాన్ని కలిపి బ్యాంకులు రుణం కింద మంజూరు చేస్తాయి. ఏటా వేల సంఖ్యలో కార్పొరేషన్లకు దరఖాస్తులు వస్తుంటాయి. ఆ విధంగానే గతేడాది వేల మంది రుణాల కోసం దరఖాస్తు చేయగా దస్త్రాల్లో మంజూరు చూపినా చేతికి చిల్లిగవ్వ కూడా అందలేదు. గత ఏడాది రుణ మంజూరు ఉత్వర్వులు జారీ చేసినా, రాయితీ మొత్తం విడుదల కానివారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వారందరూ ఈ ఏడాది రుణాల కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, వారి రుణ లక్ష్యాలను ఈ ఏడాదికి బదిలీ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గత ప్రభుత్వంలో మంజూరైన వారికి ఈ ఏడాది రుణాలు అందించడానికి స్థానిక నేతలు, కమిటీలు ఆమోదించే పరిస్థితి ఉండదేమోనని వారంతా భయపడుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించాలని కోరుతున్నారు. ఆన్‌లైన్‌లో రాయితీ మంజూరైనట్లు కనిపించటంతో తమకు రాయితీ వస్తుందా? లేక తమ దరఖాస్తును ఆన్‌లైన్‌లో రద్దు చేసుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లకు వెళ్లి తమ పరిస్థితి ఏమిటని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. వారికి కూడా ఉత్తర్వులు రాకపోవటంతో ప్రభుత్వం త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పి పంపిస్తున్నారు. కొంతమంది రాయితీ పడలేదని బ్యాంకు నుంచి లేఖ తెచ్చుకుంటే, ఇలా ఎంతమంది ఉన్నారో ప్రభుత్వానికి మరోసారి లేఖ రాస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు బ్యాంకుల వైపు పరుగులు పెడుతున్నారు.