ఆగమ్యగోచరంగా కోడెల శివరామ్ పరిస్థితి
గుంటూరు,
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. అవకాశం, అవసరం ఉన్నంత వరకు రాజకీయాల్లో జోష్ ఉంటుంది. కానీ, అవి ఏ మాత్రం తేడా వచ్చినా.. పరిస్థితి దారుణంగా మారుతుందనడం లో సందేహం లేదు. ఇప్పుడు గుంటూరుకు చెందిన సీనియర్ రాజకీయ దిగ్గజం, మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు వారసుడు కోడెల శివరామకృష్ణ పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు పరిశీలకులు.జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు శివరామ్‌కు కొన్ని సూచనలు చేశారని, వాటిలో కీలకంగా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనే విషయం చర్చకు వస్తోందని అంటున్నారు పరిశీలకులు. 2014 ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు… సత్తెనపల్లి నుంచి విజయం సాధించారు. దీనికి ముందు నరసరావుపేట నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు విజయం సాధించి రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక, ఈ ఏడాది జరిగిన తాజా ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ సత్తెనపల్లిలోనే ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఆయన ఆత్మ స్థయిర్యం కోల్పోయి ఆత్మహత్యకు ఒడిగట్టారు.అయితే, ఇప్పుడు ఆయన వారసుడిగా డాక్టర్ శివరామ్ తెర మీదికి రావాలని కోడెల అనుచరులు కోరుతున్నారు. కానీ, ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు హయాంలోనే నమోదైన కేసులను ఇప్పుడు పోలీసులు తిరగదోడుతున్నారు. ఈ నేపథ్యంలో శివరామ్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబే సూచించారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పార్టీ పరంగా, రాజకీయంగా నీకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారట. దీంతో కోడెల వారసుడు శివరామ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే ప్రచారం జరుగుతోంది.ఇదిలావుంటే, అటు సత్తెనపల్లిలో రాయపాటి వారసుడు రంగారావు తిష్టవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి చంద్రబాబు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించిందని అంటున్నారు. రాయపాటి సాంబశివరావు వయోభారంతో ఇప్పటికే రాజకీయాలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన తప్పుకుంటే ఆ ఫ్యామిలీకి ఏదో ఒక సీటు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. రాయపాటి కన్ను సత్తెనపల్లి మీదే ఉందంటున్నారు. రాయపాటి సత్తెనపల్లిలో దిగితే…. కోడెల కంచుకోట నరసరావుపేటలో ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన చదలవాడ అరవిందబాబు కూడా పునాదులు పటిష్టం చేసుకునే పడ్డారు. అప్పుడు శివరామ్ కు ఆప్షన్ ఉండదు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఇక, కోడెల శకం ముగిసినట్టేనని అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.